- రానున్న ఐదేళ్లు రాష్ట్రానికి అత్యంత కీలకమన్న ప్రధాని మోదీ
- డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధిని పరిగెత్తిస్తాం
- జూన్ 4న ఎన్డీఏ కూటమి 400కు పైగా లోక్‌సభ సీట్లు గెలవాలి
- వికసిత ఆంధ్రప్రదేశ్ తోనే వికసిత భారతం సాధ్యమన్న మోదీ
- గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం నెలకొంది
- రాష్ట్ర మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు
- ‘ప్రజాగళం’ సభకు వచ్చిన జన సంద్రం రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం
- కూటమి గెలుపుతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి
- రాష్ట్రం కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కృషిని ప్రశంసించిన ప్రధాని
చిలకలూరిపేట : దేశవ్యాప్తంగా లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజల పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. ఆదివారంనాడు చిలకలూరిపేట వద్ద బొప్పూడిలో జరిగిన ‘ప్రజాగళం’ మహాసభలో ఆయన ప్రసంగిం చారు. తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీ కూటమి ఈ భారీ సభను ఏర్పాటు చేసింది. సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని గమనించిన మోదీ సభ ఆసాంతం ఎంతో ఉల్లాసంగా కనిపించారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో దేశ వికాసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై తమ అభిప్రాయాలను ప్రధాని వెల్లడిర చారు. గత ఐదేళ్ల్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన కలిగిన మోదీ ఎన్నికల తరువాత రానున్న ఐదేళ్లు నవ్యాంధ్ర అభివృద్దికి ఎంతో కీలకమని, ఆ ప్రగతి పయనంలో రాష్ట్రానికి అండగా ఉంటానని సందేశాన్నిచ్చారు.
‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ కోటప్పకొండలోని త్రిమూర్తుల ఆశీర్వాదాలు తనకు లభించినట్లుగా భావిస్తున్నానని, ఈ దీవెనలతో ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం మరెన్నో సాహసోపేతమైన నిర్ణయాలను తీసు కుంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
వికసిత ఆంధ్రప్రదేశ్ అత్యవసరం – డబుల్ ఇంజన్ సర్కార్ మార్గం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘వికసిత భారత్’ లక్ష్యంగా కృషి చేస్తోందని, ఇది నెరవేరాలంటే ‘వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం’ అత్యవసరమని, ఈ ప్రయత్నం లో రాష్ట్రానికి అండగా ఉంటామని ప్రదాని మోదీ హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు మూడు పార్టీల కూటమికి భారీ విజయాన్ని అందించాలని ఆయన కోరారు. కూటమి విజయంతో రాష్ట్రానికి జరిగే మేలును వివరిస్తూ.. సంక్షేమ పథకాలను మరింతగా విస్తరించు కోవచ్చని, యువత, మహిళలకు భారీ ఎత్తున అభివృద్ధి అవకాశాలను అందించవచ్చని, రాష్ట్రంలో కుంటు పడిన మౌలిక సదుపాయాలను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవచ్చని, ఓడరేవుల అభివృద్ధితో పాటు బ్లూ ఎకానమీ (మత్స్యరంగం)ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసుకోవడంతో పాటు పలు ఇతర అభివృద్ధి చర్యలు చేపట్టవచ్చని.. కనుక ఎన్డీఏ ఆధ్వర్యంలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్ ఏర్పాటుకు ప్రజలు మద్దతివ్వాలని మోదీ కోరారు.
జూన్ 4న 400కు పైగా లోక్‌సభ సీట్లు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అదే రోజున ఎన్డీఏకు 400కు పైగా లోక్‌సభ సీట్లు లభించే లక్ష్యంగా కృషి చేస్తున్నా మని ప్రధాని తెలిపారు. ఎన్డీఏలోకి తెదేపా వంటి పాత మిత్రులు చేరటంతో కూటమి మరింతగా బలపడిరదని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నవ్యాంధ్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి భారీగా మద్దతు తెలపాలని ఆయన కోరారు. ప్రధాని ప్రసంగం తీరు ఈ లక్ష్య సాధన పట్ల విశ్వాసాన్ని తెలియజేసింది. రాష్ట్ర ప్రజలు రెండు సంకల్పాలతో ఎన్నికలకు ముందు సిద్ధమయ్యారని.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించటం, రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నట్లు భావిస్తున్నానని మోదీ అన్నారు.
రాష్ట్రానికి ఎన్డీఏ వలన గతంలో జరిగిన మేలు
ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ పురోగతి లక్ష్యాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుందని, ఈ మేరకు 2014-19 కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో మేలు చేసిందని ప్రధాని మోదీ వివరించారు. రాష్ట్రాన్ని ప్రధాన విద్యా కేంద్రంగా మార్చటానికి నవ్యాంధ్రలో ఏర్పాటు చేసిన పలు విద్యా సంస్థల వివరాలను ఆయన వెల్లడిరచారు. మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడలో నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ డిజైన్, తిరుపతిలో ఐఐటీ మరియు ఐసర్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం మరియు ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, విజయ నగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ, గుంటూరులో నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ డిజాష్టర్ మేనేజ్ మెంట్, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కష్టమ్స్ అండ్ నార్కొటిక్స్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటును ప్రధాని గుర్దు చేశారు. వీటితో యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
పేదల కోసం పనిచేసే ఎన్డీఏ
ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసమే పనిచేస్తాయని ప్రధాని మోదీ నొక్కి వక్కాణించారు. దీనికి మద్దతుగా.. గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తెచ్చినట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పేదల కోసం పది లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి అనుమతించినట్లు.. అందులో 5 వేల పక్కా ఇళ్లు పల్నాడులోనే నిర్మించటం, జల్ జీవన్ మిషన్ కింద కోటి కుటుంబాలకు ఉచిత కుళాయి కనెక్షన్లు ఇవ్వటం, ఆయుష్మాన్ భారత్ కింద కోటి 25 లక్షల మందికి ఉచిత వైద్యాన్ని అందజేయటం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.700 కోట్ల ఆర్థిక సాయాన్ని రైతులకు అందించటాన్ని ప్రధాని ఉదహరించారు. ఇంకా ఎక్కువ స్థాయిలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని మోదీ ప్రజలను కోరారు. రాష్ట్రం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎంతో కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసించారు.
రాష్ట్రంలో దుస్థితి-భారీ ప్రజా వ్యతిరేకత
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ది వ్యతిరేక వాతావరణం నెలకొందని.. మంత్రులు పరిపాలనను గాలికొదిలేసి అవినీతి చేయడంపై ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించి రాష్ట్రంలో జగన్ పాలనలో నెలకొన్న అధ్వాన్న స్థితికి అద్దం పట్టారు. సభకు వచ్చినవారిలో కనిపించిన శక్తి, ఉత్సాహం కూడా మరో రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను, రాష్ట్రంలో వారు మార్పును ఎంత గట్టిగా కోరుకుంటున్నారో తెలిపిందని ఆయన అన్నారు.
ఎన్డీఏ, కాంగ్రెస్ ల మధ్య తేడా
అందరి భాగస్వామ్యులను కలుపుకు పోయేది ఎన్డీఏ కూటమి అని, నిరంతరం అంత:కలహాలతో కొట్టుమిట్టాడేది ప్రతిపక్ష ఇండియా కూటమి అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ఇండియా కూటమి సభ్య పార్టీల మధ్య జరుగుతున్న నిరంతర కలహాలను ఆయన ఎత్తిచూపారు. ఎన్నికలకు ముందే ఇలా కీచలాడుకునేవారు.. ఎన్నికల తరువాత ఏం చేస్తారో ఆలోచించాలని ఆయన ప్రజలను హెచ్చరించారు.
విలక్షణ మోదీ
బొప్పూడి ప్రజాగళం మహాసభకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విలక్షతను లక్షలాది ప్రజల సాక్షిగా మరోసారి ఆవిష్కరించారు. సభకు భారీసంఖ్యలో జనం హాజరయ్యారు. చోటుదొరక్క కొంతమంది లైటింగ్ టవరెక్కారు. అది చూసిన మోదీ ఆందోళన చెంది స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి వారిని ఉద్దేశించి ‘మీరు వెంటనే టవర్ దిగాలి. విద్యుత్ వైర్లతో కూడిన టవరెక్కటం ప్రమాదకరం. మీరు వెంటనే దిగాలి. దగ్గర్లోవున్న పోలీసులు వారిని దించాలి’ అంటూ వారు టవరు దిగేవరకూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇది జరిగినంతసేపూ మోదీ ఎంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం చంద్రబాబు తన ప్రసంగంలో.. ప్రధాని మోదీగారు ఈ ప్రమాదాన్ని గమనించి హెచ్చరించటం ఆయన ముందుచూపునకు, ప్రజలపట్ల ఆర్తికి సంకేతమని, అటువంటి నాయకుడు ప్రధాని కావటం దేశం అదృష్టమని మెచ్చుకున్నారు.
తెలుగువారిని ఎన్డీఏ గౌరవిస్తే.. కాంగ్రెస్ అవమానించింది
తెలుగువారి ఆత్మ గౌరవానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు విఘాతం కల్పిస్తే.. వారిని ఎన్డీఏ గౌరవించిందని మోడీ వివరించారు. రామమందిర్ ప్రతిష్టను గుర్తు చేస్తూ స్వర్గీయ ఎన్టీ రామారావు రాముడు, కృష్ణుడు పాత్రలకు జీవం పోశారని ఆయన ముఖ్యమంత్రిగా రైతులు, పేదల శ్రేయస్సు కోసం పోరాడితే కాంగ్రెస్ ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మోదీ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన స్మారక నాణాన్ని విడుదల చేశామని.. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహరావును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానిస్తే ఎన్డీఏ ఆయనను ‘భరతరత్న’ బిరుదుతో సత్కరించామని మోదీ అన్నారు.