అమరావతి: పేదల గొంతుకోస్తున్న నిజమైన పెత్తందారు జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టడం మరోసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను నయవంచన చేయడమేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. తనను ఏ వర్గం పట్టించుకోవడం లేదని తెలిసే జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభించాడని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోగానీ, వైసీపీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఎక్కడైనా మచ్చుకైనా సామాజిక న్యాయం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరుపున సామాజిక సాధికార బస్సుయాత్ర చేస్తున్న మంత్రులు, వైసీపీ నేతలను ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉండే ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర బస్సుల్ని నిలిపే ధైర్యం ఉందా. ప్రభుత్వం తలపెట్టిన బస్సు యాత్రను తూతూమంత్రంగా నిర్వహిస్తున్న మంత్రులు. బస్సుల్ని ఎక్కడో పెట్టి, డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ సిబ్బంది, వాలంటీర్ల సాయంతో ప్రజల్ని బస్సులున్న చోటికి తరలించి, యాత్రను మమ అనిపిస్తున్నారు. ఎస్సీలకు మంచి చేశాననే నమ్మకం, ధైర్యం జగన్ రెడ్డికి ఉంటే, ఆ వర్గం నివసించే ప్రాంతంలో సామాజిక సాధికార బస్సుల్ని నిలపాలి. అలానే బీసీలు, మైనారిటీలు నివసించే చోట బస్సుల్ని నిలిపి, అక్కడే మంత్రులు, వైసీపీ నేతలు మాట్లాడాలి. అలా మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని వర్ల ప్రశ్నించారు.
దళితవాడల్లోకి బస్సుల్ని తీసుకెళ్లి, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి :
నిజంగా మంత్రులు, వైసీపీ నేతలు దళితవాడల్లోకి, పల్లెల్లోకి బస్సులు తీసుకెళితే, అక్కడి దళితులు వారిని తరిమి తరిమి కొడతారు. చంద్రబాబు మా కోసం అమలుచేసిన 27 సంక్షేమ పథకాల్ని జగన్ రెడ్డి ఎందుకు రద్దుచేశాడో సమాధానం చెప్పండి అంటూ వెంటపడి మరీ మంత్రుల్ని, వారి బస్సుల్ని తరిమి కొడతారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.1,14,000 కోట్లు మీరు, మీ ముఖ్యమంత్రి ఎందుకు దారి మళ్లించారో చెప్పండి అంటూ మంత్రుల్ని నిలదీస్తారు. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు 14 లక్షల ఎకరాలు ఎందుకు కాజేశారని ఆయా వర్గాలవారు మంత్రుల్ని ప్రశ్నిస్తారు. నాలుగున్నరేళ్లలో ఎందరో దళిత యువకులు, దళిత ఆడబిడ్డల్ని ఎందుకు అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారో చెప్పాలంటూ ఆగ్రహంతో ఎదురు తిరుగుతారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిసే మంత్రులు దళిత వాడల్లోకి వెళ్లకుండా, వెళ్లినా బస్సులు దిగకుండా సామాజికసాధికార బస్సుయాత్రను మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని వర్ల విమర్శించారు.
అంబేద్కర్ పేరు తొలగించి, విదేశీవిద్య పథకానికి జగన్ పేరు పెడతారా? :
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు తొలగించి, విదేశీవిద్య పథకానికి జగన్ పేరు పెడతారా? ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన అంబేద్కర్ ఎక్కడ.. ప్రపంచంలోనే గొప్ప అవినీతిపరుడిగా పేరుపొందిన జగన్ ఎక్కడ? విదేశీవిద్య పథకం ద్వారా నాలుగున్న రేళ్లలో జగన్ రెడ్డి ఎంతమంది దళిత, బీసీ, మైనారిటీ యువకుల్ని విదేశాలకు పంపాడో మంత్రులు చెప్పాలి. చంద్రబాబునాయుడు వేల సంఖ్యలో ఇన్నోవా కార్లు ఇచ్చి, ఎందరో దళితబిడ్డలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఒక్క ఎస్సీ యువకుడికైనా రూపాయి స్వయంఉపాధి రుణం ఇచ్చారా? ఇచ్చాడని మంత్రులు బస్సుయాత్రలో నిరూపించగలరా? చంద్రబాబు దళిత బిడ్డలకు కార్పొరేట్ విద్యను అందించడం కోసం బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం తీసుకొస్తే వాటిని జగన్ రద్దు చేశాడు. స్కూళ్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి, బుద్ధిలేదా అని ప్రశ్నించింది. ఇదేనా జగన్ రెడ్డి దళితులకు చేసిన మేలు ? దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి, అతని శవాన్ని అతని ఇంటివద్దే పడేసిన తన పార్టీ ఎమ్మెల్సీని పక్కనే కూర్చోబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి సిగ్గులేకుండా దళితబిడ్డలకు తాను మేనమామని ఎలా చెబుతాడు? దళితుల్ని చంపుతూ.. చంపిస్తూ..వారిపై తప్పుడు కేసులు పెడుతూ..మేనమామనంటే సరిపోతుందా? అందుకే మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తున్నాం.. బస్సుల్ని దళిత పల్లెల్లో నిలబెట్టి జగన్ రెడ్డి చేసిన ఘనకార్యాలు ఇవి అని చెప్పగల ధైర్యం వారికి ఉందా? డాక్టర్ సుధాకర్ని, కిరణ్ కుమార్.. విక్రమ్.. ఓంప్రతాప్ వంటి దళితబిడ్డల్ని తమ నాయకుడే చంపించాడని మంత్రులు దళితవాడల్లోకి వెళ్లి చెప్పగలరా? వరప్రసాద్ అనే దళితయువకుడు తమ ఇసుక మాఫియాపై ప్రశ్నించాడని అతనికి శిరోముండనం చేయించామని ధైర్యంగా మంత్రులు చెప్పగలరా? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క బ్యాక్ లాగ్ పోస్ట్ అయినా భర్తీ చేశాడా? తన నియోజకవర్గంలో దళితమహిళ నాగమ్మ దారుణంగా అత్యాచారం, హత్యకు గురైతే ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించని ముఖ్యమంత్రి దళితులకు మేనమామా? వెటర్నరీ వైద్యుడు అచ్చెన్నను అన్యాయంగా బలితీసుకున్న జగన్ రెడ్డి, పల్లెల్లోకి వెళ్లి తాను దళితుల్ని ఉద్ధరించానని చెప్పగలడా అని వర్ల రామయ్య నిలదీశారు.