- జగన్‌రెడ్డి.. పెద్దిరెడ్డి.. ఇద్దరూ తోడుదొంగలు
- అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తా.
- ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతా
- కుప్పంతో సమానంగా పుంగనూరు అభివృద్ధి
- ఎంపీగా కిరణ్, ఎమ్మెల్యేగా చల్లాని గెలిపించండి
- పుంగనూరు ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు
పుంగనూరు (చైతన్య రథం): అధికారం కోసం ముద్దులు పెట్టిన జగన్, సీఎం అయ్యాక పిడిగుద్దులు గుద్దాడు. జగన్ పాలనలో పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు అన్నీ బాదుడే బాదుడు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడుతూ….‘‘మేం పొత్తు పెట్టుకుని వాస్తవాలు చెబుతున్నాం. కానీ గతంలో జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నాడు. రాష్ట్రం కోసం పెట్టుకున్న పొత్తు మంచిదా? చీకటి ఒప్పందం మంచిదా? కేసుల కోసమే జగన్ ఒప్పందం చేసుకున్నాడు, మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధితోపాటు సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు ప్రకటించారు.
జగన్ ఫ్రస్టేషన్లో ఉన్నాడు….
పెద్దిరెడ్డి ఒక రకమైతే, సైకో జగన్ అంతకుమించిన రకం. ఇద్దరూ తోడుదొంగలు. ఓటమి భయంతో జగన్ తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు 200 శాతం పెంచేశారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో జగన్, పెద్దిరెడ్డి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. రూ. వంద రూపాయలు వచ్చే కరెంటు చార్జీలు… నేడు వెయ్యికి పెంచేశారని ఫైర్ అయ్యారు. జగన్‌కు తగిలిన గులకరాయి కనబడదు, దెబ్బ మాత్రం తగిలిందని ఎద్దేవా చేశారు. నాడు కోడికత్తి డ్రామా…నేడు గులకరాయి డ్రామా ఆడి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూశారని మండిపడ్డారు.‘‘ఎవరికి చెప్తావ్ నీ డ్రామాలు జగ్గుబాయ్….నార్త్ కొరియాలో కిమ్‌లాగా…మన ఏపీలో జిమ్లాగా జగన్ ఉన్నారు’’ అని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు. ఏపీలో ఎవరు ఆనందంగా ఉండకూడదని.. మొత్తం డబ్బు తన దగ్గరే ఉండాలనేది జగన్ దుర్భుద్ధి అని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులను జగన్, పెద్దిరెడ్డి దగ్గర జూన్ 4 తర్వాత కక్కిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.
పుంగనూరు ప్రజలకు నేడు స్వాతంత్య్రం వచ్చింది….
ప్రజాగళం జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లింది. పుంగనూరు ప్రజలకు ఈ రోజే స్వాతంత్య్రం వచ్చింది. రాబోయే రోజులు అన్నీ మంచిరోజులే. రాష్ట్రంలో, పుంగనూరులో గెలిచేది మనమే. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు చల్లా బాబు. అతనొక బుల్లెట్‌లాగా దూసుకెళతారు. రామచంద్రారెడ్డీ మిడిసిపడుతున్నావు. అసలు నీకూ కిరణ్ కుమార్ రెడ్డికి పోలిక ఉందా? నల్లారి కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తండ్రి రాజకీయ నాయకుడు. ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటే… ఒకటి నేను, రెండో వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి.’’ అని చంద్రబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు. పెద్దిరెడ్డి కొవ్వు కరిగిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. పాపాల పెద్దిరెడ్డీ… నువ్వు మంత్రివి. నీ కొడుకు మిథున్ రెడ్డి ఎంపీ. నీ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే. ప్రజలు, మేము నీకు బానిసలం అనుకుంటున్నావా? బాగా కొవ్వెక్కిపోయింది. పొగరుబోతు ఆంబోతుగా తయారయ్యావు. ప్రజలే నీ కొమ్ములు విరుస్తారు. రాజంపేట ఎంపీగా కిరణ్‌కుమార్‌రెడ్డి గెలవడం ఖాయం. దేశ ప్రధానిగా మళ్లీ మోదీ అవుతారు. పాపాల పెద్దిరెడ్డీ ఇక నీకు నిద్ర ఉండదు. ఎన్డీయే అంటే అభివృద్ధి… వైసీపీ అంటే అవినీతి అని మోదీ పిలుపునిచ్చిన విషయం గుర్తుపెట్టుకో అని చంద్రబాబు హెచ్చరించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి భూస్థాపితం చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు ధైర్యం చెప్పారు. పాలల్లో కమీషన్లు, మామిడి పంటలో కమీషను, ఆవులాపల్లి రిజర్వాయర్ అవినీతి.. మైనింగ్, మద్యం, ఇసుక.. అంతా అవినీతి. రాష్ట్రంలో ఏమీ మిగల్చకుండా దోచేశారని దుయ్యబట్టారు.
ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతా….
పుంగనూరు నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు అన్యాయం జరగలేదు. ఇప్పుడు ఎంపీగా ఉన్నంత వరకూ అన్యాయం జరగదు. పేదలకు న్యాయం చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి ముందుంటారు. కిరణ్ కుమార్ రెడ్డి అంటే నాకు గౌరవం. ఎస్సీల కోసం సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టం చేసి అమలు చేశారన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు, జనసైనికులు, టీడీపీ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు, కార్యకర్తలందరిదీ ఒకటే ఆలోచన…ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించాలి…పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. చల్లా బాబు చేతిలో పెద్దిరెడ్డి చిత్తుగా ఓడిపోబోతున్నాడని జోస్యం చెప్పారు.
కుప్పంతో సమానంగా పుంగనూరును అభివృద్ధి….
పుంగనూరులో చల్లా బాబును గెలిపించండి. కుప్పంతో సమానంగా అభివృద్ధి చేస్తాం. నేను సీఎం అయ్యాక రాజముద్రతో రైతులకు పాస్‌పుస్తకం ఇస్తాను. పుంగనూరులో ఉర్దూ గురుకుల జూనియర్ కళాశాలను నిర్మిస్తాం. చింతపండు రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేస్తాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఎన్నికలు సజావుగా జరగాలి. భయపడొద్దు. ఎన్నికల కమిషన్ అన్ని గమనిస్తోంది. స్థానిక పోలీసులే కాదు, కేంద్ర బలగాలు కూడా ఉంటాయి. దౌర్జన్యాలకు పాల్పడేవారి మక్కెలు విరగ్గొట్టి మీకు ఓటేసే స్వేచ్ఛ ఇస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపమని చెప్పి ఉద్యోగస్థులంతా సంఫీుభావాన్ని తెలుపుతున్నారు. ఎప్పుడూ లేనివిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. ఉద్యోగుల్లో ఇంత కసి ఉందని ఊహించలేదు. వారికంటే ఎక్కువ కోపం ప్రజలకుంది. పాపాల పెద్దిరెడ్డికి మళ్లీ లైసెన్స్ ఇవ్వొద్దు. ఇక్కడే రాజకీయంగా భూస్థాపితం చేయాలి. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడుకుంటాను’ అని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.