రాష్ట్రంలో నీరా పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
కల్లుగీత కార్మికుల జీవనోపాధికై మద్యం పాలసీలో రిజర్వేషన్ కల్పించాం
నీరా పరిశ్రమతో కార్మికులకు ఉపాధి, సమాజారోగ్యం లక్ష్యంగా కృషి
బీసీల అభ్యున్నతిపై కుట్రలు చేస్తే ఉపేక్షించేది లేదన్న కొల్లు
రాజమహేంద్రవరం (చైతన్య రథం): రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే.. వైసీపీ నేతలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేలా వ్యవహరించడం సిగ్గుచేటని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని మంజీరా హోటల్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ప్రధాని సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా సాగుతోందని, అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు నాడు అన్న ఎన్టీఆర్ కృషి చేశారని, వారి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడినవారికి అండగా నిలవడంలో లక్ష్యంగా మద్యం షాపుల్లో, బార్లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించామని, లైసెన్సు ఫీజులో కూడా 50 శాతం సబ్సిడీ కల్పించామని గుర్తు చేశారు. వడ్డెర కార్మికులకు బిల్డింగ్ మెటీరియల్ మైన్స్‌లో 30 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. బీసీ వర్గాల్లోని వెనుకబాటుతనాన్ని నిర్మూలించే లక్ష్యంతో అధ్యయనం చేస్తున్నామని, అందులో భాగంగా నీరా పరిశ్రమను పరిశీలించామని చెప్పారు. 1986లో అన్న స్వర్గీయ ఎన్టీఆర్ రీసెర్చ్ సెంటర్‌కు భూమిపూజ చేశారని, బడుగు బలహీన వర్గాల్లోని భవిష్యత్ తరాలకు మేలు చేసేలా పని చేయాలని సూచించారని గుర్తుచేశారు. దేశంలోని నలుమూలల నుంచి 200కి పైగా తాడిచెట్లను తీసుకొచ్చి పెంచుతున్నామని, ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న నీరా పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నీరా పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా పలు రకాలైన ఉప ఉత్పత్తులు రూపొందించే అవకాశం ఉంటుందని, వాటి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు. కేరళలో కొబ్బరి నీరా, శ్రీలంకలో పలు పరిశ్రమలు ఉన్నాయని, తాటి ముంజల నుంచి తీసిన పిండి పదార్థాలను మైదాకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఉత్పత్తులన్నీ పరిశీలించిన తర్వాత ఆయా ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ కల్పిస్తే ఆయా వర్గాలకు తోడ్పాటు అందించే అవకాశం కలుగుతుందన్నారు.
నీరా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించడం, గీత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్లు అందించడం, చెట్టుపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయాలపాలైన వారికి ఆర్థిక తోడ్పాటు అందించామని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లపాటు గీత కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, జీవోలు ఇవ్వడం తప్ప ఏ కార్మికుడి కుటుంబానికి కూడా పైసా చెల్లించలేదని విమర్శించారు. గీత కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన రోజునే చంద్రన్న బీమాను పునరుద్ధరిస్తూ జీవో తీసుకురావడం అభినందనీయమని, కార్మిక శాఖ నుంచి రూ.5 లక్షలు, ఎక్సైజ్ శాఖ నుంచి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు 54 మంది చెట్లపై నుంచి పడి మరణించినట్లు గుర్తించామని, వారందరికీ త్వరలోనే ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే వైసీపీ నేతలు ప్రతిరోజూ ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నారని మంత్రి ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి 16,800 మందికి దగా చేశారని, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, అమర్‌నాథ్ గౌడ్ వంటి ఎంతోమంది బీసీలను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. బీసీ నాయకత్వంపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, గత ఐదేళ్లు బీసీలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినప్పుడు నోరెత్తని వైసీపీలోని బీసీ నేతలు ఈరోజు ఏదో జరిగిపోతోందని అనడం సిగ్గుచేటని విమర్శించారు.
నిన్నటివరకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారని, అమరావతే రాజధాని అని, తర్వాత మూడు రాజధానులు అని చెప్పిన వైసీపీ ఇప్పుడు నీచమైన రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తూ, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని, ప్రాంతాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవారిని వెనకేసుకొచ్చి సమాజంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో రామతీర్థంలో రాముని శిరస్సు ఛేదించినవారిని వెనకేసుకొచ్చారని, అంతర్వేదిలో రథం దగ్ధం చేశారని, విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెండి రథంలో సింహాలు దొంగిలించారని గుర్తుచేశారు.
మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఐదేళ్లలో ఏకంగా రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని, కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్ది రాష్ట్ర ఖజానా లూటీ చేశారని, కల్తీ మద్యంతో వేలాదిమంది ప్రాణాలు తీశారని మంత్రి ఆరోపించారు. కానీ నేడు మెరుగైన మద్యం పాలసీతో పొరుగు రాష్ట్రాలు సైతం మెచ్చుకునేలా మద్యం పాలసీ అమలు చేశామన్నారు. పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా తీసుకునే నిర్ణయాలను కూడా తప్పుబట్టడానికి సిగ్గుండాలని, విశాఖపట్నం, సూర్యలంకలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తే రాద్ధాంతం చేయడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్‌డోర్ షాప్స్ పెట్టడాన్ని తప్పుపట్టడం సరికాదని ప్రశ్నించారు.గత ఐదేళ్లలో వైసీపీ చేసిన దోపిడీ మొత్తం క్రమంగా బయటపడుతుండటంతో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని మంత్రి విమర్శించారు. ఈమధ్యే జోగి రమేశ్ కల్తీ దందా కేసులో అరెస్టయ్యారని గుర్తుచేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలన్నింటినీ ప్రజలు గుర్తించారని, వైసీపీ ఐదేళ్ల దుర్మార్గాలను గమనించి 11 సీట్లకు పరిమితం చేశారని, ఇంకా అవే విధానాలు, అవే అరాచకాలకు పాల్పడితే వైసీపీ భూస్థాపితం కావడం తథ్యమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
















