మచిలీపట్నం కు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్ కు పెన్షన్ తొలగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంట్లో 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడుతున్నారని 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న పర్వీన్ పెన్షన్ తొలగింపును టీడీపీ అధినేత ప్రశ్నించారు. బందరులో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో వేదిక పైకి పర్వీన్ తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
18 ఏళ్లు వచ్చినా వైకల్యం కారణంగా తల్లిదండ్రులు చేతులపైనే పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా? పెన్షన్ కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యింది?90శాతం వైకల్యం ఉన్న అమెకు నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా? అని నిగ్గదీశారు. వాస్తవంగా చెప్పాలి అంటే వైకల్యంతో ఉంది ఆమె కాదు…. మీరు మీ ప్రభుత్వం అంటూ చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. సంక్షేమ పథకాల్లో ఆంక్షలతో కోతలపై సమాధానం చెప్పాలి అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు ట్వీట్ చేశారు.