నిష్పక్షపాత పాత్రికేయ విలువలతో పనిచేస్తున్న ఈనాడు గొంతునొక్కేందుకే వైసిపి ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా గళాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న అన్ని రకాల యంత్రాంగాలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీ సిఐడీ ఢల్లీికి వెళ్లి ప్రెస్ మీట్లు పెడుతున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మార్గదర్శిపై లేనిపోని తప్పుడు ఆరోపణల చేస్తూ ప్రతీకార చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని, చిట్ ఫండ్ యజమాని తన కమీషన్‌ను పెట్టుబడిగా పెట్టుకోవచ్చని 1982 చిట్ ఫండ్ చట్టమే చెబుతోందన్నారు. కేవలం కంపెనీ ఆర్జించే కమీషన్, ఇతర ఆదాయ నిల్వలను మ్యూచువల్ ఫండ్స్, షేర్లు మొదలైన వాటిలో పెట్టుబడులుగా పెట్టారు. 2022 మార్చి 31 నాటికి కంపెనీ లిక్విడ్ అసెట్స్/ఆస్తులు విలువ రూ. 2,723 కోట్లు. చందాదారులకు చెల్లించాల్సింది కేవలం రూ. 1170 కోట్లు మాత్రమే అన్నారు.
మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నయ్, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు మరియు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ అనే మూడు అనుబంధ సంస్థలను కలిగి ఉంది. ఇదే విషయాన్ని కంపెనీ చట్టంలోని నిబంధనల ప్రకారం 31.03.2022 నాటికి ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లలో బహిర్గతం చేశారు. ఈ మూడు సంస్థలు మాత్రమే అయా రాష్ట్రాల్లో మాత్రమే చిట్ ఫండ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ రహిత వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని చెప్పడం అర్ధరహితమన్నారు. సిఐడికీ కనీసం బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల వెరిఫికేషన్, ప్రాథమిక అకౌంటింగ్ సూత్రాల పై ఎటువంటి అవగాహన లేనట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన చెక్కులను, వసూళ్లను నగదు రూపంలో లెక్కిస్తారు. అకౌంట్ లో క్రెడిట్ చేయబడినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లలో ప్రతిబింబిస్తాయి. ఇది సాధారణంగా ఆమోదించబడిన అకౌంటింగ్ విధానం. సిఐడీకి ఈ విషయం తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు.
చిట్ ఫండ్స్ చట్టం- 1982 లో పేర్కొన్న నిబంధనలలో ‘‘డిపాజిట్’’ అనే పదం నిర్వచించబడలేదు. కానీ, చట్టంలోని సెక్షన్ 73 మాత్రం రిజర్వ్ బ్యాంక్ పాత్రను నిర్దేశిస్తుందన్నారు. చిట్ ఫండ్స్ చట్టం- 1982, సెక్షన్ 73 రిజర్వ్ బ్యాంక్ యొక్క సలహా పాత్ర గురించి స్పష్టంగా వివరిస్తోందన్నారు. ఈ చట్టానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ పాలసీ ప్రశ్నలపై తన స్వంత సూచనలు గానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలపై తగిన సలహాలను గానీ ఇవ్వవచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్.బి. ఐ చిట్ ఫండ్ కంపెనీలను ‘‘ఇతర నాన్ బ్యాంకింగ్ కంపెనీలు’’గా వర్గీకరించింది. నాన్ బ్యాంకింగ్ కంపెనీలు తనకు వచ్చే కమీషన్ తో వ్యాపారం చేయకూడదని సిఐడీ నిరూపించగలదా? అని ప్రశ్నించారు.