- కాకినాడను డ్రగ్ సిటీగా చేశారు
- మీరు వేసే ఓటు జగన్ గుండెల్లో దిగాలి
- కూటమి ప్రభుత్వం రాగానే మీ ఫొటోలతో భూమి పాస్ పుస్తకాలు
- సైకిల్, గ్లాసు, కమలానికి అడ్డొచ్చే ధైర్యం ఎవరికుంది?
- కాపులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం
- జగన్ జలగన్న రాజ్యంలో అంతా దోపిడీనే
- కాకినాడ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
కాకినాడ, చైతన్యరథం: జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రశాంతమైన గోదావరి జిల్లాలు పులివెందుల్లా మార్చారని, వైసీపీ నేతలు కాకినాడ సిటీని డ్రగ్ సిటీగా మార్చారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి చంద్రబాబు కాకినాడలో రోడ్ షో నిర్వహించి అనంతరం సభలో మాట్లాడుతూ మరో వారం రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు జగన్‌రెడ్డి గుండెల్లో దిగాలన్నారు. కాకినాడలో ఓ పిల్లసైకో ఉన్నాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సైకోలందరి పని పడాతమని హెచ్చరించారు. ప్రజల ఆస్తి పత్రాలపైన జగన్‌రెడ్డి ఫోటోలు ఉండటమేంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఆస్థిదారుల ఫోటోలతో పాస్ పుస్తకాలు ముద్రించి ఇస్తామని హామీనిచ్చారు. కాపులతోపాటు బీసీలు, ఎస్‌సీలు,ఎస్‌టీలు, మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఇంకా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ
ప్రశాంతమైన గోదావరిని ఐదేళ్లలో పులివెందులను చేశారు
బాబాయిని గొడ్డలితో చంపినవాడు పిల్లవాడా? జగన్ రెడ్డి చెబుతున్నట్లు పిల్లవాడైతే పార్లమెంటుకు కాదు..పలకా బలపం ఇచ్చి ఆయనను బడికి పంపాలని చెప్పాను. బాబాయిని చంపిన ఆ పిల్లవాడిని మ్యూజియంలో పెట్టాలి. కాకినాడ ప్రజలకు రోషం ఉంటే..ఈ సిటీని నాశనం చేసిన వాడిని బంగాళఖాతంలో కలుతారా? లేదా? ఈ రాష్ట్రంలో ఒక అహంకారపూరితమైన సైకో ఉన్నాడు. ఇక్కడ కాకినాడలో పిల్ల సైకో ఉన్నాడు. అక్కడ విధ్వంసమే విధానం. అమరావతిని నాశనం చేశాడు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. ఊరికో సైకోను తయారు చేశాడు పెద్ద సైకో జగన్ రెడ్డి. తూర్పుగోదావరి చాలా ప్రశాంతమైన జిల్లా.. మంచి నీళ్లు అడిగితే..కొబ్బరి నీళ్లు ఇస్తారు. ఐదేళ్లలో ఇలాంటి జిల్లాలో దుర్మార్గులు వచ్చి పులివెందులను చేయాలని చూస్తే వదిలిపెడుదామా? ఈ చిన్న సైకో పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోడు..ఎవరితో పెట్టుకుంటున్నాడో ఈ చిన్న సైకో గుర్తుపెట్టుకోవాలి. రౌడీయిజాన్ని అణచివేసిన పార్టీ టీడీపీ. డబ్బు మదంతో విర్రవీగే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరకి కళ్లెం వేసామని చంద్రబాబు అన్నారు.
మీరు వేసే ఓటు జగన్‌రెడ్డి గుండెల్లో దిగాలి
మాది ప్రజా మేనిఫెస్టో..జగన్ ది నకిలీ నవరత్నాలు..వెలవెల పోయాయి. ప్రజా మేనిఫెస్టో కళకళలాడుతుంది. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం. ఆడబిడ్డలకు మహాశక్తి కింద నెలకు రూ.1500, ఏడాది రూ.18,000 ఇస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. తల్లికి వందనం తో బిడ్డలందరినీ చదివిస్తాం. ఆంక్షలు లేవు. ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తాం. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000 ఇస్తాం. నేనే మహిళలకు వంటగ్యాస్ ఇచ్చాను. డ్వాక్రా సంఘాలు పెట్టాను. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు నేను ఇచ్చాను. దీంతో నేడు రివర్స్ కట్నం వచ్చింది. ఏడాది మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా ధైర్యంగా వెళ్లండి. నేను, పవన్ కళ్యాణ్ లే మీ డ్రైవర్లు. యువతకు జాబు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం. ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలతో ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. స్కిల్ డెవపల్ మెంట్ సెంటర్లు పెట్టి ప్రంపంచ కంపెనీల్లో పనిచేసుకునేలా వర్క్ స్టేషన్లు తీసుకొస్తాం. అవసరమైతే కాకినాడలోనే ఐటీ టవర్ కడుతాం. నచ్చిన కంపెనీలో పనిచేసుకోవచ్చు. టెక్నాలజీని నేను ప్రమోట్ చేశా. సెల్ ఫోన్లు టెక్నాలజీని మనమే ప్రోత్సహించాం. నేడు మీ చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లు దాని ఫలితమే. రాబోయే ఎనిమిది రోజులు సైకిల్ ఎక్కండి. చేతిలో గ్లాసు, కమలం పట్టుకోండి. ఎవడైన అడ్డువస్తే..గ్లాసుకు పదును పెట్టండి. అడ్డువచ్చే ధైర్యం ఎవరికీ లేదు. మీరు వేసే ఓటు జగన్ రెడ్డి గుండెల్లో దిగాలి అని చంద్రబాబు అన్నారు.
జగన్‌రెడ్డిది క్యాష్ వార్
రైతులను రాజులు చేస్తాం. తూర్పుగోదావరి గోదావరి జలాలతో కళకళలాడే జిల్లా..అలాంటి జిల్లాలో పంట హాలిడేలు ప్రకటించే పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి. అది చేసే భాధ్యత నాది. ఇంటింటికి త్రాగునీరు ఇస్తాం. ప్రతీ ఒక్కరిటీ ఇళ్లు కట్టించే బాధ్యత మాది. జాగ లేనివారికి జాగా ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ లను మూసేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. వృద్ధులు ఫించన్ డబ్బులతో అన్న క్యాంటీన్ లో తింటే నెలకు రూ. 450 అవుతుంది. మిగిలినది రూ.1500 వందలు. దీంతో నెలంతా బ్రతికుతారనుకున్నా. అటువంటి అన్నక్యాంటీన్లను సైకో రద్దు చేశాడు. జగన్ రెడ్డి చెబుతున్నట్లు ఇది క్లాస్ వార్ కాదు. ఇది క్యాష్ వార్. ఒకప్పుడు క్వాటర్ బాటిల్ రూ.60 నేడు రూ.200. మద్యంబాబుల బలహీనతను క్యాష్ చేసుకుని దోచుకున్నాడు. మన రాష్ట్రంలో దొరికే బ్రాండ్లు మరెక్కడా దొరకవు. జేబ్రాండ్లతో 35 వేల మంది ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచిన దుర్మార్గుడు జగన్ అని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ఫోటోలు వేసి భూమి పత్రాలు ఇస్తాను
తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు. వారసత్వంగా వచ్చిన భూమిపై మీ ఫోటో గానీ, మీ తాత ఫోటో గానీ ఉండాలి. జగన్ ఫోటో ఎందుకు? జగన్ అన్న భూహక్కు పత్రం అంట. మీ భూమి ఈయన బాబు ఇచ్చాడా? భూమి పత్రాలపై తన ఫోటో వేసుకుని సైకో ఆనందపడుతున్నాడు. మేం వచ్చిన తర్వాత మీ ఫోటోతో భూమి పాస్ పుస్తకాలు ఇచ్చే భాధ్యత నాది. జగన్ రెడ్డి పాస్ పుస్తకాలను చింపి ముక్కలు చేద్దాం. నా భూమిపై మీ పెత్తనం ఏంటని సైకో పార్టీవారు వచ్చి ఓటు అడిగితే నిలదీయండి. జగన్ రెడ్డి తెచ్చిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కాదు. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు. రేపటి నుంచి మీ భూమి హక్కు పత్రాలను ఒరిజినల్స్ వారి దగ్గర పెట్టుకుని మీకు జిరాక్స్ కాపీలు ఇస్తారట. శాశ్వత రికార్డులు ఉంటేనే భూములు కొట్టేసిన వ్యక్తి జగన్ రెడ్డి. అలాంటిది రికార్డే లేకపోతే..మీ పరిస్థితి ఏమిటీ? దొంగ దగ్గర తాళాలు పెట్టుకుంటే ఏమవుతుందో ఆలోచించండి. మీ భూములు అమ్ముకోవాలన్న జగన్ రెడ్డి పర్మిషన్ కావాలి. జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు పోవాలంటే రాబోయే ఎన్నికల్లో ప్యాన్ కు ఉరెయ్యాలని అన్నారు.
జగనన్న జలగ రాజ్యంలో దోపిడీయే విధానం.
కాకినాడ పోర్టు ఇతరుల చేతుల్లోకి పోయిందా లేదా?. కాకినాడ పోర్టును మెడమీద కత్తిపెట్టి కూటినీళ్లకు ఈ సైకో రాయించుకున్నాడు. 40 ఏళ్లు కష్టపడి ఆ పోర్టును అభివృద్ధి చేశాం. ప్రక్కనే సెజ్ లో 4 వేల ఎకరాలు ఉంది. రెండో పోర్టు రావాలని వాటిని నేనే సేకరించాను. అవి కూడా నేడు చేతులు మారాయి. జగనన్న జలగ రాజ్యంలో దోపిడీయే విధానం. కొండబాబు ప్రశ్నించాడని ఆయన ఇంటిపై దాడి చేశారు. జగన్ రెడ్డికి కోరలు పీకాలి. విశాఖ, కృష్ణపట్నం పోర్టులు వేరే వారి చేతుల్లోకి వెళ్లిపోయాయి. అమర్ రాజా, లులూ లాంటి పరిశ్రమలు రాష్ట్రం విడిచి పోయాయి. విశాఖలో రామానాయుడు స్టూడియో కట్టడానికి భూమి ఇస్తే దాన్ని కూడా దుర్మార్గులు రాయించేసుకున్నారు. ప్రజల ఆస్థుల పైకి వచ్చిన వారిని వదిలిపెట్టకూడదని చంద్రబాబు అన్నారు.
కాపులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం
గత ప్రభుత్వంలో రూ.3200 కోట్లు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. సైకో జగన్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి రూ.10 కోట్లు ఖర్చు చేయలేదు. రాబోయే ఐదేళ్లలో కాపుల కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇస్తున్నా. బీసీలకు ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. 50 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ ఫింఛన్ ఇస్తాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్ధిక సహాయం చేస్తాం. వలలు, బోట్లు, ఆధునికీకరణ కోసం ఆర్ధిక సహాయం చేస్తాం. 217 జీవోను రద్దు చేసి మరలా చెరువులను మత్స్యకారులకు ఇస్తాం. 10 శాతం ఎక్సైజ్ షాపులు గీత కార్మికులకు రిజర్వు చేస్తాం. వడ్డెర కులస్థులకు క్వారీలను అప్పగిస్తాం. 10 శాతం ఎక్సైజ్ షాపులు గీత కార్మికులకు రిజర్వ్ చేస్తాం. చేనేత కార్మికులకు 200 యూనిట్ లు మర మగ్గాలకి, పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తా. సంవత్సరానికి రూ.24 వేలు ఆర్థిక సహాయం చేస్తాననని చంద్రబాబు హామీనిచ్చారు.
కాకినాడను డ్రగ్ సిటీగా మార్చాడు
మేం కాకినాడను స్మార్ట్ సిటీగా చేస్తే…జగన్ రెడ్డి డ్రగ్ సిటీగా మార్చాడు. మరలా కాకినాడను ప్రశాంత నగరంగా మార్చుతాం. పెన్షనర్స్ ప్యారడైజ్..కాకినాడ. అలాంటి నగరాన్ని భూ కబ్జాలకు, పేకాట క్లబ్బులకు, అరాచకాలకు, రౌడీయిజానికి, గూండాయిజానికి, క్రికెట్ బెట్టింగులకు నిలయంగా చేశాడు. పేకాట ఆడిరచేవాడు మీకు కావాలా? రూ.15 వేల కోట్లు విలువ చేసే బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా తరలించారు. వీరిని భూస్థాపితం చేద్దామా వద్దా? ఇదొక పెద్ద కుంభకోణం. రేపు అనేది ఉందని ఈ సైకోలకు భయం లేకుండా పోయింది. జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంక్ 26 వేల మంది ఖాతాదారులు రోడ్డున పడ్డారు. వీరిలో కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికొచ్చారు. ఈయన అవినీతి సామ్రాజ్యం జిల్లా మొత్తం వ్యాపించి ఉంది. పెద్దాపురం గుట్టల్ని మింగేశారు. ఈ అనకొండల్ని ఏం చేయాలి? జగ్గంపేట, అనపర్తి, తదితర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా గ్రావెల్ ను దోపిడీ చేశారు. పెద్దాపురం, గండేపల్లి మండలాల పరిధిలో రామేశ్వరం మెట్టలో వందల ఎకరాల్లో గ్రావెల్ తరలించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కాకినాడ బెర్త్ నిర్మాణంలో కూడా కమీషన్లు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కాకినాడను దోమలు లేని సిటీగా చేస్తే..ఇప్పుడు వీరే దోమలను తయారు చేసి మీ ఇళ్లకు పంపుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
మమ్మల్ని ఆశీర్వదించండి
ప్రజాగళంతో నేను చేయాల్సింది నేను చేశాను. ఇకపై చేయాల్సింది మీరే. జగన్ రెడ్డి పేదల మనిషని ఫోజులు కొడుతున్నాడు. పేదల పక్షాన నేను ఉంటాను. ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తా. జగన్ రెడ్డికి తెలిసింది దోచుకోవడం…దాచుకోవడమే. ఎదిరించిన వారిని జగన్ రెడ్డి గొడ్డలితో బెదిరిస్తున్నాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో 160 పైగా సీట్లు మనమే గెలవాలి. 25 కు 25 పార్లమెంట్లు గెలవాలి. కాకినాడ పార్లమెంట్ కు పోటీ చేస్తున్న శ్రీనివాస్‌ను గెలిపించండి. గ్లాసు గుర్తుకు ఓటేయండి. గ్లాసు గుర్తు కేటాయింపులో కూడా రాజకీయాలు చేస్తున్నారు. అయినా పోరుడుతాం. మీకందరికీ బాగా పరిచయం ఉండే వ్యక్తి, మత్స్యాకారుల ప్రజాప్రతినిధి కొండబాబును మంచి మెజారిటీతో గెలిపించండి. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీని గెలిపించండని చంద్రబాబు కోరారు.