- నేటినుంచి అమరావతి డ్రోన్ సమ్మిట్
- ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- సదస్సులో రెండు ఎంఓయూలపై సంతకాలు
- డ్రోన్ పాలసీ ముసాయిదా ఆవిష్కరణ
- నేటి సాయంత్రం పున్నమీ ఘాట్‌లో షో
- ప్రజలంతా తిలకించేలా విస్తృత ఏర్పాట్లు
- పెట్టుబడుల శాఖ కార్యదర్శి సురేష్ పిలుపు
అమరావతి (చైతన్య రథం): రెండు రోజులపాటు నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయని, సదస్సును విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్‌కుమార్ పిలుపునిచ్చారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి డ్రోన్ సమ్మట్ ఏర్పాట్లను వివరించారు. మంగళగిరి సీకే కన్వెన్షనులో సదస్సును ఉదయం 10.30కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని, కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు పాల్గొటారన్నారు. సదస్సుకు అంచనాలకు మించి ప్రజలు, ఔత్సాహికుల నుంచి స్పందన వచ్చిందన్నారు. సదస్సులో పాల్గొనేందుకు 6,929మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని దేశానికి డ్రోన్ క్యాపిటల్‌గా ఏపీని తీర్చిదిద్దాలన్నది సీఎం సంకల్పమని అంటూ, ఆయన ఆశయ సాధనకనుగుణంగా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో మొత్తం 9 సెషన్లు, నాలుగు కీలకోపన్యాసాలు ఉంటాయన్నారు. డ్రోన్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని, ఈ రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిచేలా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. 20నుంచి 24 రంగాల్లో డ్రోన్లను ఉపయోగించడానికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు.
2 ఎంఓయులు
ఈ సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తిరుపతి ఐఐటీతో ఈ అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న ఎంఓయూ వల్ల ఏపీకి డ్రోన్ రిమోట్ పైలట్ లైసెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో 20 వేలమందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అలాగే తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్టనర్‌గా చేసుకుంటూ మరో ఎంఓయూ కుదుర్చుకుంటున్నామని తెలిపారు.
50 ఎగ్జిబిట్స్
డ్రోన్ సదస్సులో భాగంగా సీకే కన్వెన్షన్ సెంటర్లో డ్రోన్ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. 50 ఎగ్జిబిట్స్‌ని ఇందులో ప్రదర్శిస్తున్నామన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రదర్శనను ప్రజలు, విద్యార్థులు, ఔత్సాహికులు తిలకించవచ్చని తెలిపారు.
హ్యాక్‌థాన్‌కు 520మంది
ఈ సదస్సులో భాగంగా ఔత్సాహికుల కోసం డ్రోన్ హ్యాక్ థాన్ నిర్వహించామని, ఇందులో 520మంది పాల్గొన్నారని చెప్పారు. 9 థీమ్స్‌లో పోటీని నాలుగు కేటగిరీలుగా వర్గీకరించామన్నారు. ముందుగా కేవలం ముగ్గురు విజేతలను మాత్రమే ఎంపిక చేయాలని అనుకున్నామని, అయితే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. దాంతో నాలుగు కేటగిరీల్లో ఒక్కో కేటగిరీలో ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తున్నామని, మొదటి బహుమతి రూ.3 లక్షలు, రెండో బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష ఇస్తున్నామని, 22వ తేదీ సాయంత్రం పున్నమీఘాట్‌లో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.