అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఏపీ టిడ్కో ప్రాజెక్టు, గత ఐదేళ్ల రాజకీయ కక్షలో చిక్కుకుని విలవిలలాడింది. 2014-19 మధ్య షేర్ వాల్ సాంకేతికతతో, సుమారు రూ.38,265 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన లక్షలాది ఇళ్లను, 2019 తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కేవలం ‘గత ప్రభుత్వ ముద్ర’ ఉందనే నెపంతో బులుగు రంగులు పూసి, అటకెక్కించింది. ఆనాడు ‘సమీక్షల’ పేరిట కాలయాపన చేయడంతో, దాదాపు 1.28 లక్షల ఇళ్లు పిచ్చిమొక్కలు మొలిచి, పాములకు నిలయాలుగా మారి శిథిలావస్థకు చేరాయి. టిడ్కో నిధులను ఇతర పథకాలకు మళ్లించడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోయి పనులు నిలిచిపోయాయి. దీనివల్ల ఇళ్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టిన 83,865 మంది పేదలకు, వారు చెల్లించిన రూ.173 కోట్ల సొమ్మును కూడా వెనక్కి ఇవ్వకుండా గత ప్రభుత్వం వారిని నట్టేట ముంచింది. ఇల్లు చేతికి రాకపోయినా బ్యాంకులనుంచి నోటీసులు అందుకుంటూ వేలాది కుటుంబాలు ఐదేళ్లపాటు నరకం అనుభవించాయి.
అయితే జూన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుకు పూర్వవైభవం తెచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. కేవలం 21 నెలల స్వల్ప వ్యవధిలోనే 5,50,314 ఇళ్లను నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. విద్యుత్, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పార్కులువంటి మౌలిక వసతులను కల్పిస్తూ అసంపూర్తిగా ఉన్న ప్రతి ఇటుకనూ పేర్చింది. ఈ క్రమంలోనే మార్చి 30 సోమవారం నాయుడుపేట వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే విడతలో 2,50,893 పేద కుటుంబాలకు గృహప్రవేశం చేయిస్తూ చారిత్రక ఘట్టాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పండుగలో 1,00,875 టిడ్కో ఇళ్లతోపాటు మరో 1,50,018 ఇళ్లున్నాయి.
గత ప్రభుత్వం పేదల కళ్లలో కన్నీళ్లు మిగిల్చితే, నేటి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వడమే కాకుండా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు అదనపు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తోంది. 2029నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రస్థానం, సుపరిపాలనకు నిలువెత్తు సాక్ష్యం. మేస్త్రీ చంద్రబాబు పాలకుడిగా ఉంటేనే సొంతింటి కల నిజమవుతుంది. ఇలా గౌరవప్రదమైన లక్షలాది ఇళ్లను పేదలకు కట్టి ఇవ్వగలడనే గట్టి నమ్మకం నేడు ప్రజల్లో ఏర్పడింది.













