మంగళగిరి (చైతన్య రథం): ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరమంటాయి. పార్టీ ముఖ్య నేతలు కేక్‌లు కట్ చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. దీపాలు వెలిగించి రైతుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడంతో మనం ఒంటరి వాళ్లం అయ్యాం. తరువాత రాజకీయ చతురత కలిగిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి అమరావతిని రాజధానిగా ప్రకటించి అనేక అభివృద్ధి పనులు చేశారు. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా రాజధాని కోసం రైతులు వేల ఎకరాల భూములిచ్చి రాష్ట్ర భవిష్యత్‌కు పునాదులు వేశారు. ప్రజా రాజధాని కోసం రైతులు పోరాటం మరచిపోలేనిది. దేశంలో అన్నీ రాజకీయ పార్టీలు ఈరోజు అమరావతికి అనుకూలంగా ఉంటే.. కేవలం వైసీపీ పార్టీ మాత్రమే వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. కార్యక్రమంలో శాసన పరిషత్ మాజీ చైర్మన్, పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. ఆనాడు మూడు రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి పంపడంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. వైసీపీ సభ్యులు తనను ఆనాడు మానసికంగా వేధించి, అసభ్య పదజాలంతో సభలో దూషించారని తెలిపారు. ఆనాటి సభలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ.. భవిష్యత్‌తరాల ఉద్యోగ కల్పవల్లి అమరావతి అని కొనియాడారు. రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా ప్రజా రాజధాని నిలుస్తోందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో కూడా ఒకే రాజధాని అనే పదం ఉందన్నారు. 2022లో ఏపీ హైకోర్టు కూడా అమరావతే ఏకైక రాజధాని ఉంటుందని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అమరావతి చట్టబద్ధతతో జగన్‌లాంటి వ్యక్తులు అమరావతిలో ఒక్క ఇటుక కూడా కదిలించలేరని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలను రెచ్చగొట్టే జగన్‌రెడ్డిలాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో పడిన ప్రతీసారి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి సంక్షోభంనుంచి గట్టెక్కిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి.. 2019లో అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ.. మూడు రాజధానుల బిల్లు సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న తాను ఎదుర్కొన్న భయంకరమైన ఘటనలను గుర్తు చేసుకున్నారు.
నాడు వైసీపీ సభ్యులు సభలో మైక్‌లు కట్ చేసి వీడియో ప్రచారాలు నిలిపి వేసి మూడు రాజధానుల బిల్లు చట్టం చేయాలని చూశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిగతా నాయకులు మాట్లాడుతూ అమరావతి రైతుల త్యాగాలు, మహిళల పోరాటాలను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడులాంటి విజన్ ఉన్న నాయకుడితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అమరావతిలో జగన్‌లాంటి వ్యక్తులు ఒక్క ఇటుకు కూడా కదిలించలేరని తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి, పార్టీ ఎన్నారై విభాగం చప్పిడి రాజశేఖర్, మైనారిటీ కమిషన్ చైర్మన్ షేక్ ముస్తాక్ అహ్మద్, పార్టీ క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.














