అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటం శుభపరిణామమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలు అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకొనే ఆనందకర తరుణం వచ్చిందన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “ఇకపై రాజధానిగా అమరావతి అజేయం. ఈ బిల్లుకు మద్దతు పలికిన పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే అనవసర అపోహలను రాష్ట్ర ప్రజలందరూ విడిచిపెట్టేయాలి. రాష్ట్రానికి రాజధాని నగరం ఉండటమే ఇష్టం లేనివాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజాలెవరూ పట్టించుకోవలసిన అవసరం లేదు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సదరు వ్యక్తుల నైజం మరోమారు బయటపడింది. అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు ఇప్పటికే వేగవంతం అయ్యాయి. ఈ రాజధానిని ప్రతి ఒక్కరూ తమదిగా భావించే విధంగా తీర్చిదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొంది.
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ముందుకు తీసుకువెళ్లడంతోపాటు, రాజధాని నగర అభివృద్ధికి బలమైన తోడ్పాటు ఇస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర హోమ్‌మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నా. పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం తరుణంలో రాష్ట్రంలో కూటమి పక్షాలుచేసే సంబరాల్లో భాగస్వాములు కావాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిస్తున్నా. మన రాజధాని అమరావతి కోసం తోడ్పాటు ఇచ్చిన నరేంద్ర మోదీకి, అపార అనుభవంతో రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియచేస్తూ `ప్రతి ఒక్కరూ తమ ఇళ్లముందు, పార్టీ కార్యాలయాలవద్ద దీపాలు వెలిగించాలని కోరుతున్నా” అని పేర్కొన్నారు.













