- గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదు
- టీమ్‌గా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు మనమంతా సిద్ధం
- చంద్రబాబు విజనే మనందరికీ ప్రేరణ
- 4.0లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాం
- 2024-29 పాలన గురించి గొప్పగా చెప్పుకునేలా పని చేస్తాం
- ‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స’ కార్యక్రమంలో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తో ప్రేరణ పొంది.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదని, మంత్రులు అధికారులు టీమ్‌గా పనిచేసి లక్ష్యాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డును సీఎం చంద్రబాబు అందుకున్న సందర్భంగా మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు అమరావతి రాజధానిలోని సీఆర్డీయే కార్యాలయంలో ‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స’ పేరుతో ఇచ్చిన విందు సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. “2024 ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం. 25మంది మంత్రుల్లో 17మంది కొత్తవారు.
శాసనసభ్యుల్లో 50శాతం మొదటిసారి ఎన్నికయ్యారు. 2019నుంచి 2024 మధ్య పనిచేసిన టీం అంతా ఇక్కడున్నారు. అయితే ఇప్పుడే ఎందుకు ఫలితాలు సాధిస్తున్నాం? ఆ మార్పునకు కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు” అని లోకేష్ స్పష్టం చేశారు. “బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. అక్కడ లీడర్ షిప్‌పై ఒక సెషన్ జరిగింది. ఆ క్లాస్‌కు నేను హాజరయ్యాను. అక్కడ కోచ్ చెప్పిన విషయం నా దృష్టిని ఆకర్షించింది. ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తీ కూడా ఒక సంస్థలాంటిదే. చివరకు ఆ సంస్థను నడిపే నాయకుడి ప్రతిబింబంగా మారుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది సాధ్యం కాదని మనం ఎవరైనా చంద్రబాబుకి చెప్పినప్పుడు.. ఆయన సమాధానం ఎప్పుడూ ‘ఎందుకు కాదు’ అనే. మనల్ని ఆలోచనల పరిమితిదాటి ఆలోచించమని ప్రోత్సహించడం, మనల్ని పుష్ చేయడం. ఇవే మనం ఇప్పటివరకు సాధించిన విజయాలకు కారణం. ఆయన వ్యక్తిత్వం విషయానికి వస్తే, ఆయన చాలా త్వరగా ఫలితాలు రావాలని కోరుకునే నాయకుడు. వేగంగా మార్పులు తీసుకురావాలనుకునే సంస్కరణవాది” అని లోకేష్ పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్న చాలామందికి ఆయన మొదటి, రెండో ముఖ్యమంత్రి కాలంగురించి విని ఉంటారు. కానీ ప్రత్యక్షంగా అనుభవించి ఉండరు.
ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఆయన పని విధానం గురించి అర్థం చేసుకునే అవకాశం అందరికీ రాలేదు. నా అభిప్రాయం ప్రకారం, ఆయనను చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన ఐటీ సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు, టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు, కంప్యూటర్ అన్నం పెడుతుందా? అని చాలామంది ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. శంషాబాద్ విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలు అవసరమా? అని అప్పట్లో ప్రశ్నించారు. ఇప్పుడు ఆ విమానాశ్రయాన్ని చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
నేను నా అనుభవాన్ని చాలామందితో పంచుకుంటుంటాను. ఒకరు ఆయనను తండ్రితో పోల్చారు. చిన్నప్పుడు తండ్రి ఎప్పుడూ పనుల్లో బిజీగా ఉంటారు. మనం ఎక్కువ సమయం తల్లితో గడుపుతాం. తల్లి ప్రేమను పొందుతాం. కానీ పెద్దవాళ్లమయ్యాక.. కుటుంబాన్ని నిలబెట్టడానికి తండ్రి చేసిన త్యాగాలు అర్థమవుతాయి. అదేవిధంగా నేను మన ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్‌కు తండ్రిగా చూస్తాను” అన్నారు.
4.0లో భాగంకావడం అదృష్టంగా భావిస్తున్నాం
“ఇప్పుడు మేం మంత్రులుగా చంద్రబాబునాయుడు 4.0లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఇది ఆయన నాలుగో పర్యాయం. కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ మాకు మద్దతు ఇచ్చారు. దీనికి మంచి ఉదాహరణ లిఫ్ట్ పాలసీ. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయించాలనే ప్రతిపాదనను తీసుకువచ్చినప్పుడు ఆయనను ఒప్పించడానికి 30 నిమిషాలు పట్టింది. కానీ ఒకసారి ఒప్పుకున్న తర్వాత.. ఆ నిర్ణయంవల్ల గూగుల్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి మార్గం సుగమమైంది. గత 22 నెలలు ఆయనతో కలిసి పనిచేయడం అద్భుత అనుభవం” అని లోకేష్ గుర్తు చేసుకున్నారు.
2024-29 పాలన గురించి గొప్పగా చెప్పుకునేలా పనిచేస్తాం
“నా వ్యక్తిగత లక్ష్యం ఒక్కటే.. 1995-99నాటి పాలనకంటే.. 2024నుంచి 2029 వరకు ప్రభుత్వ కాలం గొప్పదని చంద్రబాబు స్వయంగా చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబునాయుడు ఎప్పుడూ 95-99 కాలాన్ని ప్రస్తావిస్తుంటారు. మంత్రులుగా మేమంతా చంద్రబాబు విజన్‌తో ప్రేరణ పొందుతున్నాం. మాకు ఎలాంటి ఈగో లేదు. ప్రతి కేబినెట్‌కు ముందు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో కలిసి సమస్యలను చర్చిస్తాం. శాఖలమధ్య పోటీగా కాకుండా.. ఒక టీమ్‌గా పనిచేస్తాం. మన లక్ష్యం ఒక్కటే.. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం” అన్నారు.
గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదు
“అహంకారం పెద్ద జబ్బు. సీనియారిటీ కాదు.. ఈగో కాదు.. ఫలితాలే ముఖ్యం. 75 ఏళ్ల వయసులో నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి అహంకారం లేకపోతే.. మనకు అహంకారం ఉండాల్సిన అవసరం లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇప్పుడు అత్యసరం. 800 ప్రాజెక్టులను ట్రాక్ చేసి, గ్రౌండ్ చేయడం చాలా పెద్ద విషయం. గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మనం చరిత్ర సృష్టించడానికే ఇక్కడ ఉన్నాం. భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వస్తున్నాయి. 50శాతం ఎప్పుడు సాధిస్తారని సీఎం అడిగారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. తామంతా ఒక టీమ్‌గా, ఎలాంటి ఈగో లేకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ లక్ష్యాలను చేరుకుంటాం” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.














