- ప్రాజెక్టు రావడం సంతోషం
- ‘క్యారియర్’పై సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ మరో భారీ పెట్టుబడిని దక్కించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ టీట్ చేస్తూ.. “క్యారియర్ సంస్థ శ్రీసిటీలో అధునాతన చిల్లర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసింది. రూ.863 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ కేంద్రం, భారతదేశంలోనే 1,500 టిఆర్ కంటే ఎక్కువ సామర్థ్యం గల హై-కెపాసిటీ కమర్షియల్ హెచ్‌వీఏసీ చిల్లర్లను తయారు చేస్తుంది. దీనితోపాటు, 15 అధునాతన టెస్టింగ్, ఆర్ అండ్ డి ల్యాబ్‌లను కలిగి ఉంటుంది. ఇది అత్యాధునిక పారిశ్రామిక శీతలీకరణ వ్యవస్థల రంగంలో రాష్ట్రస్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
డేటా సెంటర్లను ఆకర్షించడానికే పరిమితం కాకుండా, అభివృద్ధి చెందుతున్న ఏఐ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడగల పూర్తిస్థాయి తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ దార్శనికతలో ఈ ప్రాజెక్ట్ మరో ముఖ్యమైన ముందడుగు. అధునాతన ఇంజనీరింగ్ మరియు అధిక విలువ కలిగిన తయారీకి రాష్ట్రం ఒక కేంద్రంగా ఆవిర్భవిస్తున్న ఈ తరుణంలో, సామర్థ్య ఆధారిత వృద్ధి దిశగా జరుగుతున్న మార్పును ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ కీలకమైన మైలురాయిని చేరుకున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్‌కు, క్యారియర్ గ్లోబల్ ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ గిట్లిన్, క్లైమేట్ సొల్యూషన్స్ ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మైఖేల్ ఎల్ గియర్జెస్‌కు అభినందనలు” అని పేర్కొన్నారు.














