అమరావతి (చైతన్య రథం): అమెరికా విధిస్తున్న భారీ సుంకాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. రాష్ట్రంలోని 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, 30 లక్షలమందికి పైగా కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్‌కు లేఖ రాశారు. ఆక్వా రంగానికి తక్షణ చేయూత అందించేలా పలు డిమాండ్లు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరో లేఖలో పేర్కొన్నారు. రొయ్యల ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధిస్తోంది. దానికి తోడు ఇతర పన్నులతో మొత్తం భారం 60 శాతానికి చేరుతోందని సీఎం లేఖలో వివరించారు. దీనివల్ల ఏపీనుంచి జరుగుతున్న రూ.25,000 కోట్ల ఎగుమతులకు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతుల్లో కష్టాలతోపాటు దేశీయ మార్కెట్‌లో కూడా ఆక్వా ఉత్పత్తుల ధరలు 20-25 శాతం మేర పడిపోయాయని పేర్కొన్నారు.
రైతులకు కొంత ఉపశమనం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం తనస్థాయిలో ఇప్పటికే చర్యలు తీసుకుందని సీఎం వివరించారు. రొయ్యల మేతపై కేజీకి రూ.9 తగ్గించడం, యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించడం ఆ చర్యల్లో భాగమే. కేంద్రం కూడా తక్షణం స్పందించాలని కోరుతూ సీఎం పలు విజ్ఞప్తులు చేశారు. వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను 30 శాతానికి పెంచడం, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల మారటోరియం, 5 శాతం వడ్డీ రాయితీ, తాత్కాలికంగా జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. అమెరికాతో సుంకాలపై చర్చలు జరపడంతోపాటు రష్యా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లకు ఎగుమతులు పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. భారత సాయుధ దళాల ఆహారంలో రొయ్యలను చేర్చాలని, రొయ్యల రవాణా కోసం దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.లక్షకు పెంచాలని కోరిన సీఎం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేయాలని నిర్మలా సీతారామన్‌కు మరో లేఖలో విజ్ఞప్తి చేశారు. అదనంగా రాష్ట్రంలో మరో రీజినల్ ఫిషరీస్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు.















