అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా పని చేయాలని, అదే బ్రాండ్‌గా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 40 వేల మంది పాల్గొన్న ఈ కాన్ఫరెన్సులో ప్రభుత్వ ప్రాధాన్యతలు, సేవల అమలు, అర్జీల పరిష్కారంపై సీఎం విస్తృతంగా దిశానిర్దేశం చేశారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన -మూడే లక్ష్యాలు
“సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరి సహకారం వల్లే వ్యవస్థలు గాడిలో పడ్డాయి. అందరి కృషి వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది” అని సీఎం చంద్రబాబు అన్నారు.
2047 స్వర్ణాంధ్ర సాధనకు లక్ష్యాలు పెట్టుకున్నామని, పది సూత్రాలను అమలు చేస్తున్నామని చెప్పారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, 24 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు వచ్చాయని వివరించారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, అమ్కా వంటి కీలక ప్రాజెక్టులు వచ్చాయని, త్వరలో బీపీసీఎల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకుంటామని తెలిపారు. అమ్కా ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి-బెంగళూరు మధ్య ఏరో స్పేస్ సిటీగా అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. అమ్కా ప్రాజెక్టుకు 36 రోజుల్లో అనుమతులిచ్చి శంకుస్థాపన చేపట్టామని, ఈ స్పందన తీరు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని సీఎం గర్వంగా చెప్పారు.
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. సమస్యలను ఆర్థిక, ఆర్థికేతరంగా విభజించుకుని పని చేయాలని, ఆర్థికేతర సమస్యలను 100 శాతం పరిష్కరించాల్సిందేనని ఆదేశించారు. “స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అన్ని చోట్లా రావాలి. చిన్నచిన్న పనులైనా వెంటనే స్పందించండి. తక్కువ ఖర్చుతో ఇంపాక్ట్ చూపించేలా పనితీరు మెరుగుపర్చుకోవాలి” అని సూచించారు. అవినీతి కనిపించకూడదని, పారదర్శకతతో వ్యవహరించాలని హెచ్చరించారు.
జిల్లాల్లో 80 శాతం మంది పనితీరు బాగుందని అభినందిస్తూ, బాగా పని చేసిన వారిని గుర్తించి గౌరవిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ సేవల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అగ్రభాగాన నిలిచిందని, ప్రజలతో సఖ్యతగా మెలగడం వల్లే అది సాధ్యమైందని చెప్పారు. నెల్లూరు కలెక్టర్ చేసిన ప్రయోగం స్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలో నాలుగుసార్లు పర్యటనలు చేసేలా ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.
వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడంలో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాల కలెక్టర్లు టాప్-3లో నిలిచారు.
కాన్ఫరెన్సులో కాకినాడ జిల్లాకు చెందిన ఒక ఉద్యోగి గృహ నిర్మాణానికి సంబంధించి సూచనలు చేయగా, “మంచి సూచన చేశారు, అమలు చేస్తాం” అని సీఎం స్వయంగా స్పందించారు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.














