- మహానాడుపై సన్నాహక సమావేశంలో మంత్రి నారాయణ
- క్యాంపు కార్యాలయంలో సిటీ పార్టీ నేతలతో సమీక్ష
- వర్చువల్ మహానాడు నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం
- క్లస్టర్లలో ఇంటి పండుగలా మహానాడు నిర్వహణకు ఆదేశం
- డివిజన్ పరిధిలో ప్రజా సమస్యలపై తీర్మానాలు చేయాలన్న మంత్రి
- మహానాడు ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని మంత్రి సూచన
నెల్లూరు (చైతన్య రథం): భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఇంధన పొదుపులో భాగంగా ఈ ఏడాది వర్చువల్‌గా జరగనున్న మహానాడును ఇంటి పండగలా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. బుధ, గురువారం రెండురోజుల పాటు నిర్వహించనున్న మహానాడుపై గోమతినగర్ క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. వర్చువల్‌గా తొలిసారి నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేసేందుకు కృషిచేయాలని సూచించారు. సిటీ నియోజక వర్గంలోని 14 క్లస్టర్లలో మహానాడు ఏర్పాట్లపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ప్రతీచోటా ఎలఈడి వాల్స్ ఏర్పాటు చేయాలని, మహానాడులో పాల్గొనే కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. రెండురోజులపాటు పార్టీ పెద్దలు, ముఖ్యనేతలు ఇచ్చే సందేశాలను విని చేసిన అభివృద్ధిని, ఇచ్చిన సంక్షేమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసి ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రజాసమస్యలపై చర్చించి అధికారంలో ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా 44 ఏళ్లుగా మహానాడును నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ల అడుగుజాడల్లో నడుస్తూ సంస్థాగతంగా పార్టీని తిరుగులేని శక్తిగా బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్తా సైనికుల్లా పని చేయాలని క్యాడర్‌కు సూచించారు. కార్యక్రమంలో మహానాడు నెల్లూరు సిటీ అబ్జర్వర్ గురవారెడ్డి,రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ, మాజీ జడ్పిటిసి విజేతారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, కార్పొరేటర్లు, క్లస్టర్, కో క్లస్టర్ ఇంచార్జీలు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.















