- వైసీపీవి ఫేక్ రాజకీయాలు
- డీఎస్సీపై దుష్ప్రచారానికి ఆధారాలతో కౌంటర్ ఇస్తే కంగుతిన్నారు
- నిరంతరం సర్వేలు చేయిస్తున్నా
- తప్పు చేస్తే సొంతవాళ్లనైనా వదిలించుకుంటా
- కూటమితోనే మన ప్రయాణం
- పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వలేదు కాబట్టే 94% స్ట్రైక్ రేట్తో గెలిచాం
- ఇకపై తెలుగుదేశానికి ఓటమి లేదు
- కార్యకర్తలంతా
- ‘ది సీక్రెట్’ పుస్తకం చదవాలి
- క్లస్టర్ ఇన్చార్జిలతో ‘కాఫీ కబుర్లు’ భేటీ
మంగళగిరి (చైతన్యరథం): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధం చేస్తామని ఇచ్చిన హామీపై గొడ్డలి పార్టీ చేతులెత్తేసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎందుకు పక్కన పెట్టేసిందని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్చార్జ్లతో శనివారం సీఎం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని గొడ్డలి పార్టీ మాట తప్పిందని ధ్వజమెత్తింది. ఇంతటితో ఆగకుండా వ్యవస్థలను విధ్వంసం చేసింది. వైసీపీ హయాంలో చెప్పినవి చేయకపోగా తమ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025పై బురద జల్లుతోంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఎలా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారో… డీఎస్సీ విషయంలోనూ అలాగే దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలనుకున్నారు’ అని దుయ్యబట్టారు.
ఆధారాలు సహా జగన్ అండ్ కోకు కౌంటర్ ఇచ్చాం..
డీఎస్సీ నిర్వహణపై ఆధారాలతో సహా జగన్ అండ్ కోకు కౌంటర్ ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ తో గొడ్డలి పార్టీ నేతలు డిఫెన్సులో పడ్డారని చెప్పుకొచ్చారు. దుష్ప్రచారం చేయడం, ఫేక్ రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీ విధానం, సిద్ధాంతమని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు సహనం, ఓపిక అవసరం.. అలాగని గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే. వదిలిపెట్టమని హెచ్చరించారు. మంచి ఆలోచనలు చేసే వాళ్లకు మంచి వాళ్లే సహయపడతారన్నారు.. చెడు ఆలోచనలు చేసే వాళ్ల చుట్టూ గొడ్డలి బ్యాచ్ తిరుగుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటమి లేదని, ఇకపై రాదని తెలిపారు. ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలతో మంచిగా ఉంటున్నామని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామని.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని.. అందుకే టీడీపీకి ఓటమి రాదని పేర్కొన్నారు. పార్టీ పదవులు మొదలుకుని టికెట్ల కేటాయింపుల వరకు నిరంతరం సర్వేలు చేయిస్తున్నామని తెలిపారు.
లోకేష్ చక్కగా పని చేస్తున్నారు
ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వాళ్లని వదిలించుకుంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఏం ప్రచారం చేశారో… అవన్నీ తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని గడప గడపకు వెళ్లి చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఆనాడు చెప్పిన వాటిని ఈనాడు నెరవేరుస్తున్నామనే
విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. మంగళగిరిలో టీడీపీ గెలిచి చాలా కాలమైందని… 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసినా ఓడిపోయారని ప్రస్తావించారు. ఆ తర్వాత పట్టుపట్టి పని చేశారని.. 2024లో అద్భుత విజయం
సాధించారని ప్రశంసిం చారు. గెలిచిన తర్వాత కూడా మంగళగిరిలో లోకేష్ చక్కగా పని చేస్తున్నారని.. ఇప్పుడు మంగళగిరి టీడీపీకి కంచుకోటగా మారిందని చెప్పుకొచ్చారు. యుద్ధాన్ని గెలిపించే బాధ్యత తనదని… తనతో పాటు
అలుపెరగకుండా యుద్ధం చేసే బాధ్యత టీడీపీ శ్రేణులదని తెలిపారు.
కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం
రాష్ట్రంలోని ప్రతి కేంద్రంలోనూ గతానికి మించి ఓట్లు రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీపరంగా చేయాల్సిందంతా చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని… ప్రభుత్వం చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునేలా కార్యకర్తలు ఆలోచించాలన్నారు. భవిష్యత్తు రాజకీయాలకు కూటమితోనే వెళ్తున్నామని.. వెళ్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ఓట్లు చీలకూడదనే.. టీడీపీతో కలుస్తానని పవన్కల్యాణ్ చెప్పారని అన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా వెళ్లడంతోనే 94 శాతం స్ట్రైక్తేట్తో గెలిచామని ప్రస్తావించారు. పార్టీ అగ్ర నేతలు మొదలుకుని… కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ బ్రాడ్ మైండ్తో ఆలోచించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.
క్లస్టర్ ఇన్చార్జిలతో “కాఫీ కబుర్లు” చెప్తూ కార్యకర్తలను సమర్ధవంతమైన నాయకులుగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలందరూ ‘ది సీక్రెట్’ అనే పుస్తకాన్ని తప్పకుండా చదవాలని సూచించారు. బలమైన సంకల్పంతో పనిచేస్తే, అది నెరవేరడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఆటోమేటిక్గా ఏర్పడుతుందని చెప్పారు.















