- విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన తొలి మోడల్ స్కూలు
- మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నిడమర్రులో 5.2 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.16కోట్లతో భవనాల నిర్మాణం.
- అడ్మిషన్లకు విశేష స్పందన
మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నిడమర్రులో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మోడల్ స్కూలుకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. లోకేష్ విజను ప్రతీకగా రూపుదిద్దుకున్న ఈ విద్యా సంస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ ఆదేశాలతో సుమారు రూ.16 కోట్ల వ్యయంతో 5.2 ఎకరాల విస్తీర్ణంలో నిడమర్రు జడ్పీ హైస్కూలు ప్రాంగణంలో ఈ మోడల్ స్కూలును అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యనందించే లక్ష్యంతో అన్ని మౌలిక వసతులు కల్పించారు. తరగతి గదుల్లో గ్రీన్బోర్డులు, చార్ట్ బోర్డులు, డిజిటల్ బోధన కోసం ఐఎఫ్పీ ప్యానెల్స్, ఆధునిక టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేశారు. క్రీడలకు ప్రాధాన్యమిస్తూ ఫుట్బాల్ మైదానం, 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఫ్లడ్ లైట్స్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, బాల్బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులతో పాటు మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. సుమారు 400 మంది విద్యార్థులు వీక్షించే సామర్థ్యంతో యాంఫీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు.
సైన్స్ మ్యూజియం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ ల్యాబ్లు, ఆటల్ టింకరింగ్ ల్యాబ్, ఆధునిక గ్రంథాలయం వంటి సౌకర్యాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహదపడనున్నాయి. 500 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసే డైనింగ్ హాల్, ఆర్వో వాటర్ ప్లాంట్, 40 సీసీ కెమెరాలతో భద్రతా వ్యవస్థ, ప్రత్యేక పార్కింగ్ స్థలం, కిచెన్ గార్డెన్, చిన్నారుల కోసం ఆధునిక ఆట పరికరాలతో పార్కు ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థుల కోసం 28 గదులు, తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక బ్లాక్లో 12 గదులు నిర్మించారు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచేలా గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు తీర్చిదిద్దారు.. సాంకేతికత ఆధారిత బోధనతో ఈ పాఠశాల విద్యా రంగంలో కొత్త దిశ చూపుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో నిర్మితమైన నిడమర్రు మోడల్ స్కూల్లో అడ్మిషన్లకు తల్లిదండ్రులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అడ్మిషన్స్ పూర్తయ్యాయి. భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందించే కేంద్రంగా ఈ పాఠశాల నిలవనుందని స్థానికులు చెప్తున్నారు.















