- అర్హులైన ప్రతి రైతూ నమోదు చేసుకోవాలి
- రుణ రైతులకు ఆప్ట్-అవుట్ విధానం యథాతథం
- రుణేతర రైతులూ స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు
- అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడి, ఈ-పంట ధృవీకరణకు ప్రాధాన్యం
- రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం సబ్సిడీ భారం భరిస్తుంది
- వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి
అమరావతి, జూలై 7: రాష్ట్రంలోని రైతులకు పంటల భద్రత కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను 2026-27 సంవత్సరానికి (ఖరీఫ్-2026, రబీ 2026-27) మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ, సహకార శాఖల ద్వారా సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయని పేర్కొన్నారు. పంటల బీమా పథకాల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర అనుకోని కారణాలతో పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఖరీఫ్-2026 సీజన్‌లో నోటిఫై చేసిన ప్రాంతాల్లో నోటిఫై చేసిన పంటలను సాగు చేస్తున్న యజమాని రైతులు, కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులు, పంటపై బీమా హక్కు కలిగిన వారు అందరూ పథకంలో నమోదు చేసుకోవచ్చని మంత్రి పిలుపునిచ్చారు.
రైతులు గడువులోపు నమోదు చేసుకోవాలి
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఖరీఫ్-2026 సీజన్‌లో వరి మినహా అన్ని నోటిఫైడ్ పంటలకు రుణ కాలం ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు ఉండగా, రుణ, రుణేతర రైతుల నమోదు గడువు జూలై 31గా నిర్ణయించబడిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరి పంటకు రుణకాలం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 15 వరకు ఉండగా, నమోదు గడువు ఆగస్టు 15గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రబీ 2026-27 సీజన్‌లో వరి మినహా అన్ని నోటిఫైడ్ పంటలకు రుణ కాలం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు ఉండగా, నమోదు గడువు డిసెంబర్ 15గా నిర్ణయించారని, వరి పంటకు రుణ కాలం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉండగా నమోదు గడువు డిసెంబర్ 31గా నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్-2026 సీజన్‌లో అన్ని నోటిఫైడ్ పంటలకు రుణ కాలం ఏప్రిల్ 1 నుంచి జూలై 15 వరకు ఉండగా, నమోదు గడువు జూలై 15గా నిర్ణయించారని చెప్పారు.
రబీ 2026-27 సీజన్‌లో జీడిమామిడి పంటకు రుణ కాలం అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఉండగా, నమోదు గడువు నవంబర్ 15గా, టమాటా పంటకు రుణకాలం అక్టోబర్ 1నుంచి డిసెంబర్ 15 వరకు ఉండగా, నమోదు గడువు డిసెంబర్ 15గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉభయ పథకాలలోనూ రుణ రైతులు నమోదు గడువుకు కనీసం ఏడు రోజుల ముందుగా ఆప్ట్-అవుట్ ప్రకటన సమర్పించాల్సి ఉంటుందని, బీమా చేసిన పంటలో మార్పులు ఉంటే ప్రీమియం డెబిట్‌కు రెండు పనిదినాల ముందే సంబంధిత సమాచారాన్ని అందించాలని తెలిపారు. అలాగే, బ్యాంకులు ప్రీమియం చెల్లించి నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయడం సహా సీజనాలిటీ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
రుణ రైతులకు ‘ఆప్ట్-అవుట’ విధానంలో బీమా
సీజనల్ పంట రుణం లేదా కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మంజూరైన లేదా పునరుద్ధరించిన రైతులు సంబంధిత బ్యాంకు శాఖల ద్వారా ఆటోమేటిక్‌గా పంట బీమా పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. బీమా వద్దనుకునే రైతులు మాత్రమే నమోదు గడువుకు కనీసం ఏడు రోజుల ముందుగా రుణం మంజూరు చేసిన బ్యాంకు శాఖకు లిఖితపూర్వకంగా ‘ఆప్ట్-అవుట’ ప్రకటన సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి ప్రకటన సమర్పించని రైతులందరూ స్వయంచాలకంగా బీమా పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. నోటిఫై చేసిన పంటలకు సంబంధించి రుణ రైతులకు బీమా వర్తింపజేయడం తప్పనిసరి అని పేర్కొన్న మంత్రి, బ్యాంకులు రైతు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను డెబిట్ చేసి, వాస్తవ సాగు విస్తీర్ణం ఆధారంగా పంటల వారీగా బీమా నమోదు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ప్రీమియంతో కూడిన సమగ్ర వివరాలను బీమా సంస్థలకు పంపించడంతో పాటు నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్‌సీఐపీ)లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలో ప్రీమియం, రైతుల వివరాలను బీమా సంస్థలకు పంపించడంలో బ్యాంకులు లేదా ప్యాక్స్ (పీఏసీఎస్) విఫలమైతే, బీమా రక్షణ కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులదేనని స్పష్టం చేశారు.
రుణేతర రైతులకు స్వచ్ఛంద నమోదు
రుణేతర రైతులు స్వచ్ఛందంగా పథకంలో నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇందుకోసం యజమాని రైతులు రికార్డ్ ఆఫ్ రైట్స్, ల్యాండ్ పొజెషన్ సర్టిఫికేట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇతర భూ రికార్డులను సమర్పించాల్సి ఉంటుంది. కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఒప్పంద పత్రాలు లేదా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. అదనంగా బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌బుక్ ప్రతులు, రైతు స్వీయ పంట సాగు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి ఎన్‌సీఐపీలో నమోదు చేస్తారని, అసంపూర్ణ దరఖాస్తులు లేదా అవసరమైన పత్రాలు లేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరని మంత్రి తెలిపారు.
నమోదు చేసుకునేందుకు పలు మార్గాలు
రైతులు వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు, ఎంపికైన బీమా కంపెనీలు, వాటి అధీకృత మధ్యవర్తులు లేదా ఏజెంట్లు, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, క్రాప్ ఇన్సూరెన్స్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. సీఎస్సీ కేంద్రాల ద్వారా నమోదు చేసుకునే రైతుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరని ఆయన వెల్లడించారు.
అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ, ఈ-పంట ధృవీకరణ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు 2026-27 సంవత్సరానికి పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ పథకాలలో నమోదుకు అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీ కింద చెల్లుబాటు అయ్యే ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని మంత్రి తెలిపారు. అయితే, ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని, తుది ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి మినహాయింపు ఉత్తర్వులు అందేవరకు ఫార్మర్ ఐడీ నిబంధన మేరకే నమోదు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే, రైతుల నమోదు వివరాలను ప్రస్తుత సీజన్ ఈ-పంట (డిజిటల్ క్రాప్ సర్వే) వివరాలతో ధృవీకరించే విధానం కూడా 2026-27 సంవత్సరానికి కొనసాగుతుందని తెలిపారు. రైతులపై ప్రీమియం భారం తగ్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం సబ్సిడీని అందిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గడువులోపు అర్హులైన రైతులందరూ పంటల బీమా పథకాలలో నమోదు చేసుకుని ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల పరిస్థితుల నుంచి తమ పంటలకు ఆర్థిక రక్షణ కల్పించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
















