- 2027 పుష్కరాలకు ముందే ప్రాజెక్టు పూర్తి లక్ష్యం
- పోలవరాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక
- ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం
- వైకాపా హయాంలో కేవలం 2 శాతం పనులే..
- కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో 15 శాతం పనులు పూర్తి
- నిర్వాసితులకు ఇప్పటివరకు రూ.2,250 కోట్లు అందజేత
- మరో రూ.200 కోట్లు త్వరలో అందచేత
- గోదావరికి 70 ఏళ్లలో తొలిసారి జూలై 5న ఇన్‌ఫ్లోలేని పరిస్థితి
- నేడు పట్టిసీమ, తాటిపూడి పంప్‌హౌస్‌ల మోటార్లు ఆన్ చేస్తాం
- జనవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి
- క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన
పోలవరం (చైతన్య రథం): ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు ఆశించిన రీతిలో షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాము పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా షెడ్యూల్ ప్రకారం ప్రతి పని పక్కాగా జరుగుతోందన్నారు.
2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి కాగా 2019-24 మధ్య 5 ఏళ్ల వైకాపా హయాంలో కేవలం రెండు శాతం మాత్రమే తూతూమంత్రంగా జరిగాయన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు కేంద్రం నుంచి వచ్చిన రీయింబర్స్‌మెంట్ నిధులను కూడా దారి మళ్లించేసిన నీచ చరిత్ర జగన్‌దని అన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో 15 శాతం పోలవరం పనులు పూర్తి చేశామన్నారు. జగన్ హయాంలో ధ్వంసం, విధ్వంసం కారణంగా పాడైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్‌ను రూ.990 కోట్ల వ్యయంతో 440 రోజుల్లో పూర్తి చేయడం తమ ప్రభుత్వ సమర్థతకు, చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్టతకు, సీపేజీ అరికట్టడానికి ఉద్దేశించిన బట్రస్ డ్యామ్ 100 శాతం పూర్తి చేశామని రామానాయుడు చెప్పారు. దీనివల్ల వర్షాకాలంలో కూడా పనులు ఆగవన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌కు సంబంధించి గ్యాప్-1 పనులను గత ఏడాది మేలో ప్రారంభించి సంవత్సరంలో 48 శాతం పూర్తి చేశామన్నారు. అలాగే గ్యాప్-2లో పనులు గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించి ఇంకా సంవత్సరం పూర్తి కాకుండానే 29 శాతం పూర్తి చేశామన్నారు. రేపు వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా 8.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని నిల్వ చేసినట్లు మంత్రి చెప్పారు. అలాగే రాక్‌కు సంబంధించి 42.2 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం కాగా, 13 లక్షల క్యూబిక్ మీటర్లు సిద్ధం చేశామన్నారు.
ఇలా ప్రాజెక్టు పనులు ఒక క్రమ పద్ధతిలో.. ప్రణాళిక ప్రకారం పగడ్బందీగా, పారదర్శకంగా జరుగుతున్నాయని రామానాయుడు వివరించారు. అలాగే ప్రాజెక్టు కనెక్టివిటీకి సంబంధించి కుడి, ఎడమ కాలువల్లో నాలుగు టన్నెల్స్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి మూడు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయన్నారు.
పోలవరం నిర్వాసితులు త్యాగధనులు
పోలవరం ప్రాజెక్టుకి పొలాలను, స్థలాలను ఇచ్చిన నిర్వాసితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్యాగధనులుగా కొనియాడతారన్నారు. అందువల్లనే వారికి ఇప్పటివరకు తన చేతుల మీదుగా రూ.2,250 కోట్లు అందజేశారన్నారు. త్వరలో మరో రూ.200 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. అలాగే కాలనీల నిర్మాణం పూర్తి, సదుపాయాల కల్పన తదితర విషయాలను ఆయన గణాంకాలతో వివరించారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, కేంద్ర సహకారం కారణమన్నారు.
టూరిజం హబ్‌గా పోలవరం
పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోపల పూర్తి చేయడమే కాకుండా, ఈ ప్రాంతాన్ని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా, టూరిజం హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారని రామానాయుడు చెప్పారు. అందులో భాగంగానే రూ.500 కోట్ల వ్యయం కాగల ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కొన్ని పనులు కూడా ప్రారంభించామన్నారు. పోలవరం ప్రాజెక్టును సమీప పట్టణాలకు, నగరాలకు అనుసంధానించే రోడ్లు, ఐకానిక్ వంతెనలు నిర్మిస్తామన్నారు. భద్రాచలం వరకు పాపికొండల మీదుగా బోటు షికార్లు, కాటేజీలు అనేకం వస్తాయన్నారు.
ఎల్‌నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు
ఎల్ నినో, సూపర్ ఎల్ నినోల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో, మన రాష్ట్రంలో ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎల్ నినో లేని రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జలధార-జల హారతి 100 రోజుల కార్యక్రమం చేపట్టారన్నారు. అతివృష్టి, అనావృష్టి ప్రాంతాల్లో డ్రెయిన్లు, కాలువలు ఏర్పాటు చేసి వీటిని సమీప చెరువులకు అనుసంధానించడం ద్వారా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టవచ్చు అన్నారు. జలధార-జల హారతి కార్యక్రమంలో ఇప్పటికి 98 రోజులు పూర్తయ్యాయని అన్నారు. ఈ పనులన్నీ సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భూమినే జలాశయంగా మార్చుకుని భూగర్భ జల సంపదను వృద్ధి చేయడమేనని ఆయన వివరించారు. భూగర్భ జల మట్టం ఒక మీటరు పెరిగితే 99 టీఎంసీల నీరు లభ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. అలాగే సమర్థ నీటి యాజమాన్యం వల్ల నీటి పొదుపును పాటించవచ్చు అన్నారు. ఉదాహరణకు మన కృష్ణానదిని తీసుకుంటే జూరాల, ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీళ్లు లేవు. పులిచింతలలో మాత్రం ఈరోజు కూడా 28 టీఎంసీల నీరు ఉంచుకోగలిగామని మంత్రి వివరించారు.
70 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే జూలై 5వ తేదీన కూడా గోదావరికి ఇన్‌ఫ్లో లేకపోవడం ఇదే మొదటిసారి అని మన ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజే 56,000 క్యూసెక్కుల నీరు వచ్చిందని, ఈ రాత్రికి పోలవరం దగ్గరకు లక్ష క్యూసెక్కులు రావచ్చని అంచనా వేస్తున్నట్లు రామానాయుడు చెప్పారు. రేపు బుధవారం ఉదయం పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లు ఆన్ చేసి, నీటిని విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఇలా ప్రాధాన్యక్రమంలో అత్యవసరాల ప్రాతిపదికన నీటిని పొదుపుగా వాడుకుందామన్నారు. ఎల్ నినోను సమర్థంగా ఎదుర్కొందామన్నారు. ప్రతినిత్యం.. ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకి నీరు అందించాలని ఆలోచించే చంద్రబాబు ఉండటం మన అదృష్టంగా రామానాయుడు అభివర్ణించారు. అందువల్ల ఆయనే మనందరికీ భద్రత, భరోసా అని రామానాయుడు పేర్కొన్నారు.
పోలవరం ప్రధాన డ్యామ్ ఈసీఆరఎఫ్ పనుల పరిశీలన అనంతరం జలవిద్యుత్ కేంద్రం పనులను పరిశీలించి, పనుల పురోగతిని అధికారులు, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ ఆర్, ప్రాజెక్టు పనుల పురోగతి, గోదావరి డెల్టా ప్రక్షాళన, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సీఈ చిన్నబాబు, పోలవరం ఎసఈ రామచంద్రరావు, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు సతీష్ బాబు, గంగాధర్, మురళి తదితరులు పాల్గొన్నారు.

















