- భారీ మెజారిటీతో గెలిపించడంవల్లే పెద్దఎత్తున అభివృద్ధి పనులు
- మంగళగిరి ప్రజలే నా కుటుంబం… వారి ఆశీస్సులే కొండంత బలం
- ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నా
- ‘మన ఇల్లు -మన లోకేష్’ రెండోరోజు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
మంగళగిరి (చైతన్య రథం): రాష్ట్రమంతా మంగళగిరివైపు చూసేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నాకు ప్రజల ఆశీస్సులు కావాలి. మంగళగిరి నియోజకవర్గం నా సొంత కుటుంబం. ఇక్కడి ప్రజల దీవెనలే నాకు కొండంత బలాన్నిస్తాయి” అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. మన ఇల్లు -మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీకే కన్వెన్షన్ సెంటర్లో రెండోరోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మంగళగిరి నియోజకవర్గం ప్రజల ఆశీస్సులే నాకు కొండంత బలం. మీరిచ్చిన 91వేల మెజారిటీ వల్లే నేను పెద్దఎత్తున పనులు చేయగలుగుతున్నా. భారీ విజయం ఇవ్వడంవల్లే కేంద్ర పెద్దలతో మాట్లాడి పెద్దఎత్తున నిధులుతెచ్చి, అభివృద్ధి పనులు చేయగలుగుతున్నా” అని స్పష్టం చేశారు.
మంగళగిరి ప్రజల మనసు గెలిచా
నేను మంగళగిరిలో పుట్టి పెరగలేదు. నాకు సొంత అక్కాచెల్లెళ్లు లేరు. మంగళగిరి ప్రజలను చూస్తుంటే సొంతవారిని చూస్తున్నట్లుగా ఉంటుంది. 2019లో మంగళగిరిలో పోటీ చేసినప్పుడు, ఇంటిపట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇమ్మని అడిగారు. అవగాహన లేకుండా లేనిపోని హామీలు ఇవ్వకూడదని చెప్పా. ఫలితంగా 5300 ఓట్ల తేడాతో ఓడిపోయా. ఓటమి ఎవరికైనా బాధ కలుగుతుంది. ఓటమి నాలో కసి పెంచింది. ఐదేళ్లు అహర్నిశలు కష్టపడి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నా. ప్రజలకు ఆరోగ్యం బాగోలేకపోతే ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ ద్వారా మందులు అందించా. నిరుపేదలకు తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, స్త్రీశక్తి పేరిట మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చా. పేదల ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టా. కుటుంబంలో దురదృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఖర్చులు అందించా. చెట్ల కింద సేదదీరడానికి సిమెంటు బల్లలు ఏర్పాటుచేశా. సుమారు 29 సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షంలో ఉండగా సొంత నిధులతో చేపట్టా”నని మంత్రి లోకేష్ వివరించారు.
హామీలు నెరవేర్చేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్నా
“గతఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నా. తొలివిడతలో 3వేలమందికి, రెండో విడతలో మరో 3వేలమందికి శాశ్వత పట్టాలు పారదర్శకంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు మంత్రి లోకేష్ చెప్పారు. వందపడకల ఆసుపత్రి, గ్రామాల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు అభివృద్ధి చేస్తున్నా. రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మిత్రుల సహకారంతో, సీఎస్ఆర్ నిధుల ద్వారా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు భారతదేశం మొత్తం నిడమర్రు స్కూలు గురించి మాట్లాడుతోంది. మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు తన కుమార్తెకు నిడమర్రు స్కూలులో సీటుకావాలని ఓ తల్లి నాతో గొడవపడింది. ప్రభుత్వ పాఠశాలలో సీటుకోసం ప్రజలు దెబ్బలాడటం నేను గతంలో ఎన్నడూ చూడలేదు. వ్యవస్థను మెరుగుపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా.
మంగళగిరి నియోజకవర్గ భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. నియోజకవర్గం అంతటా చేయాలంటే రూ.1800 కోట్లు ఖర్చవుతుంది. కేంద్రంతో సంప్రదించి చాలెంజ్ ఫండ్ నుంచి నిధులు తెచ్చి, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధులు కలిపి భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించాం. తాగునీరు, పైప్ లైన్ గ్యాస్, వందపడకల ఆసుపత్రి, మహానాడు రిటైనింగ్ వాల్ పనులు కూడా ప్రారంభిస్తున్నాం. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మూసేసిన అన్న
క్యాంటీన్లు ప్రారంభించాం. తాగునీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. గుడులు, చర్చిలు, మసీదుల పనులను కూడా విడతల వారీగా చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తున్నా” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ప్రజాసంక్షేమమే లక్ష్యం
తల్లికి వందనం కింద ప్రభుత్వం రూ. 10వేల కోట్లు ఖర్చుచేస్తోంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేస్తున్నాం. గత ఏడాది జూన్ మాసంలో పిల్లలు స్కూలులో జాయిన్ కాకుండా ఇవ్వడంవల్ల చిన్నచిన్న సమస్యలు వచ్చాయి. ఈసారి ఒక నెల సమయం తీసుకొని ఈరోజు నుంచి 24వరకు తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో జమచేస్తున్నాం. 4వేలపెన్షన్, ఉచిత సిలెండర్లు, స్త్రీశక్తి, మత్స్యకార సేవలో, చేనేత సోదరులకు ఉచిత విద్యుత్వంటి సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఎంపీ పెమ్మసాని కార్యక్రమానికి రాలేకపోయారు. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రానికి రప్పించేందుకు ఆయన కృషిచేస్తున్నారు. నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను 12 నెలల్లో పూర్తిచేసేలా పనులు వేగవంతం చేశాం. ఇద్దరం కలసికట్టుగా పనిచేయడం వల్లే పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు నందం అబద్ధయ్య, పోతినేని శ్రీనివాసరావు, వల్లభనేని వెంకట్రావు, పడాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















