- స్థానిక ఎన్నికల్లో వారికి అంతకంటే టిక్కెట్లు కేటాయిస్తాం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి (చైతన్యరథం): బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంలో టీడీపీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ బీసీలకు రాజకీయంగా న్యాయం చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టపరంగా రిజర్వేషన్ల అమలుకు అవకాశం లేని పరిస్థితుల్లోనూ, పార్టీపరంగా 34 శాతం పైగా టికెట్లు కేటాయించి బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీకి ప్రత్యేక చరిత్ర ఉందని పల్లా తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో 1987లో స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా 1995లో వాటిని 34 శాతానికి పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. బీసీలను కేవలం ఓటర్లుగా చూడకుండా ప్రజాప్రతినిధులుగా, నాయకత్వ స్థానాల్లో నిలబెట్టేందుకు పార్టీ నిరంతరం కృషి చేసిందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోనూ బీసీల సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యం కొనసాగుతోందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని, వారి రాజకీయ ఎదుగుదలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
బీసీల రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యానికి విఘాతం కలిగించారని వైసీపీపై పల్లా విమర్శలు గుప్పించారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదన్న దురుద్దేశంతోనే జగన్ అండ్ కో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీసీల సంక్షేమం పేరుతో ప్రకటనలు చేయడం, ఎన్నికల వేళ వారి ఓట్లను పొందడం తప్ప, రాజకీయంగా వారికి బలమైన ప్రాతినిధ్యం కల్పించడంలో వైసీపీ విఫలమైందని విమర్శించారు. బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే ఆ పార్టీ రాజకీయమైతే, వారికి అవకాశాలు కల్పించి నాయకత్వాన్ని పెంపొందించడం టీడీపీ విధానమని పేర్కొన్నారు.
బీసీలకు న్యాయం చేయాలన్న తమ సంకల్పాన్ని రాజకీయ అడ్డంకులు దెబ్బతీయలేవని పల్లా స్పష్టం చేశారు. న్యాయస్థానాల నిర్ణయాలను గౌరవిస్తూనే, బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అనుసరిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల అమలులో ఎదురైన న్యాయపరమైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, పార్టీపరంగా 34శాతం పైగా టికెట్లు కేటాయించే దిశగా కట్టుబడి పనిచేస్తామని పునరుద్ఘాటించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ నాయకులు, కార్యకర్తలకు తగిన అవకాశాలు కల్పించి వారి రాజకీయ సాధికారతకు బాటలు వేస్తామని చెప్పారు, వారి రాజకీయ ఎదుగుదలకు పార్టీ అండగా నిలుస్తుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.















