- గెలిచే అభ్యర్థులకే టికెట్లు
- మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి
- టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, బూత్ కమిటీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ఆదివారం ఆయన ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోరులో అభ్యర్థుల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కూటమి భాగస్వామ్యపక్షాలైన జనసేన, బీజేపీలతో సమన్వయం తదితర అంశాలపై సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు.
తీసిన గొయ్యిలో వారే పడ్డారు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ‘గొడ్డలి పార్టీ’ కోర్టులను ఆశ్రయించింది. కానీ అన్ని అడ్డంకులను అధిగమించి కోర్టు ఆదేశాల మేరకే మనం ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఈ ఎన్నికల్లో కూటమి కొట్టే దెబ్బతో గొడ్డలి పార్టీ శాశ్వతంగా మూతపడటం ఖాయం. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటి స్ఫూర్తిని మళ్లీ ప్రదర్శించాలి. ఆనాటి కంటే మరింత కసితో ప్రతి ఒక్కరూ పనిచేయాలి” అన్నారు. కూటమి ధర్మం చాలా ముఖ్యం “మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం.. అందుకే మిత్ర ధర్మం పాటించడం అత్యంత ముఖ్యం. జనసేన, బీజేపీ నేతలను కలుపుకొని ముందుకెళ్లాలి. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆయా పార్టీల నేతలతో వెంటనే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి” అని సీఎం స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై తేల్చిచెప్త… “వ్యక్తిగత పంతాలు, పట్టింపులకు పోతే అసలు లక్ష్యం దెబ్బతింటుంది. సర్వేలు, క్షేత్రస్థాయి బలాన్ని బట్టి ఎవరైతే కచ్చితంగా గెలుస్తారో వారికే సీట్లు కేటాయిస్తాం. ఎమ్మెల్యేలు కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించుకోవాలి” అని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి
తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎల్లప్పుడూ వెన్నెముకగా ఉన్నారని, అందుకే వారికి 34 శాతం కంటే అదనంగా స్థానాలు కేటాయిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. “ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నాం కాబట్టి ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడిగే హక్కు మనకే ఉంది. మనం చేసిన మంచిని ప్రతి ఒక్కరికీ వివరించాలి. ఓటరు జాబితాలను క్లస్టర్ల వారీగా సిద్ధం చేసుకుని, ఇంటింటికీ వెళ్లి సంక్షేమ ఫలాలను వివరించాలి. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి చిన్న చిన్న తప్పిదాలకూ తావివ్వకూడదు” అని శ్రేణులను హెచ్చరించారు. ప్రభుత్వ పాలనతో సమానంగా పార్టీ కార్యక్రమాలనూ నడిపిస్తున్నానని, ఇప్పటికే 59 నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా సమీక్షలు పూర్తి చేశానని వెల్లడించారు. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.













