- అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్చార్జి మంత్రులదే
- నవంబరు 15 నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సమరానికి కూటమి ప్రభుత్వం సమర శంఖం పూరించింది. కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే సహచర మంత్రులతో నిర్వహించిన సమావేశంలో సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల రోడ్మ్యప్ను ఖరారు చేశారు. నవంబరు 15 నాటికి ప్రక్రియను పూర్తి చేసి రెగ్యులర్ పాలనలోకి వెళ్లాలని ఆదేశించారు. 100 శాతం స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించి తీరాలని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్చార్జి మంత్రులదేనని స్పష్టం చేశారు. వారంతా మరింత చురుగ్గా ఉంటూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను సమన్వయం చేసుకుని క్లీన్స్వీప్ సాధించేలా వ్యూహాలకు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు.
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టణాల్లో బీసీల జనాభా శాతం బాగా పెరిగిందని… ఎన్టీఆర్ సమయంలో బీసీలకు 24శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో 34 శాతం బీసీలకు ఇచ్చారని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లపై సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాయని విమర్శించారు.
ఎన్నికలకు కూటమి సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. నవంబరు 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలను పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలని మంత్రులకు సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్చార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఇన్చార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఏ ఒక్క స్థానం లోనూ ఓడిపోవడానికి వీల్లేదని, 100 శాతం స్థానాలను గెలుచుకుని తీరాల్సిందేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త నాయకత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు.
గతంలో 34 శాతం రిజర్వేషన్ ఉంటే దానిని కదిలించింది జగన్ అని.. ఆ తర్వాత హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లలేదని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తుంటే.. అది అమలు కాకుండా కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్ రాకుండా వైసీపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు సాధ్యమైనంత ఎక్కువ రిజర్వేషన్ ఇద్దామని, పార్టీపరంగా 34 శాతం రిజర్వేషన్ ఇద్దామని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. వైసీపీ కోర్టుకు వెళ్లకుండా ఉంటే 34 శాతం రిజర్వేషన్ అమలయ్యేదన్నారు. గతంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో కూడా జగన్ తప్పులు చేశారని వ్యాఖ్యానించారు. కమిషన్ వేయకుండానే జగన్ 34 శాతం రిజర్వేషన్ జీవో ఇచ్చారని.. దీంతో ఆనాడు హైకోర్టు కొట్టివేసిందన్నారు. ‘సర్’ తర్వాత వచ్చే ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని జగన్ కోర్టుకు వెళ్లారని తెలిపారు.
ఎల్నినో సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 34 శాతం లోటు వర్షపాతం ఉన్నప్పటికీ గత ఏడాది నీటి నిల్వలు చేసుకోవడం వలన ఈ ఏడాది కొంతవరకు బయటపడ్డామని చెప్పుకొచ్చారు. మంత్రులు ప్రేక్షకుల మాదిరిగా ఉండవద్దని.. కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. కేంద్రంలో ఉన్న సంబంధిత శాఖ మంత్రితో టచ్లో ఉండాలని తెలిపారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను సోమ, మంగళవారాల్లో విడుదల చేస్తామని.. ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చెప్పున విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక వివరాలను అధికారులు చదివి వినిపించారు.













