- బీసీలకు అదనంగా వేల స్థానాలు
- కూటమి సర్కారు కీలక నిర్ణయం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన డెడికేటెడ్ బీసీ కమిషన్ (రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్) సిఫార్సులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీలు మినహా వివిధ కేటగిరీలకు చెందిన దాదాపు 1.40 లక్షలకు పైగా స్థానాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించే అవకాశం ఉంది.
38వేల మందికి పైగా పదవులు:
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తింపజేస్తుండటంతో 38వేల మందికి పైగా బీసీలకు స్థానిక ప్రజాప్రతినిధులుగా పదవులు దక్కనున్నాయి. గత వైసీపీ హయాంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో సుమారు 33వేల మంది బీసీలకే అవకాశం దక్కగా, ఇప్పుడు జిల్లాల విభజన, వార్డులు, డివిజన్ల పెంపుతో మరింత మంది బీసీ నాయకులకు పదవులు లభించనున్నాయి.
చట్టబద్ధ రిజర్వేషన్లు తగ్గినా.. పార్టీలపరంగా 34శాతం స్థానాలు:
చట్టపరమైన నిబంధనల ప్రకారం 34శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు ఉండే కేటగిరీల్లో కూడా కూటమి పార్టీల తరపున బీసీ అభ్యర్థులకే టికెట్లు కేటాయించి… మొత్తం మీద 34 శాతం స్థానాలు దక్కేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ…మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేస్తూనే, బీసీలకు గరిష్ఠంగా ఎక్కువ స్థానాల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.













