- మొదటి ఎఫ్‌ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోవడంపై విస్తుపోయిన న్యాయమూర్తి
- 17ఏ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చినా పలు ఐపీసీ కేసులు కొనసాగుతాయన్న సీఐడీ న్యాయవాది
- కాదు.. అన్ని కేసులు ఎగిరిపోతాయన్న సాల్వే
- ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్‌పై శుక్రవారం నాడు తీర్పు
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి నిరోధక సవరణ చట్టం, 2018 లోని సెక్షన్ 17 ఏ కింద రక్షణ లభిస్తుందా అనే అంశంపై సుప్రీం కోర్టులో 5 రోజులుగా కొనసాగిన వాద, ప్రతివాదనలు నిన్న ముగిశాయి. ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. 17 ఏ విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో నమోదు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసుతోపాటు ఇతర కేసులన్నీ నిరర్థకమవుతాయని న్యాయ నిపుణుల అభిప్రాయం. అందుకనే.. తీర్పు ఎప్పుడు వస్తుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
17 ఏ వేధింపుల నుండి రక్షణ కవచం
సెక్షన్ 17 ఏ కక్షపూరిత కేసుల నుండి రక్షణ కల్పించే ఒక కవచం వంటిదని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే గట్టిగా వాదించారు. ఈ సెక్షన్ జులై 2018లో అవినీతి నిరోధక చట్టం సవరణ ద్వారా వచ్చిందని, అంతకుముందు మరియు ఆ తరువాత నమోదయ్యే కేసులన్నింటికి అది వర్తిస్తుందని.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఈ మేరకు రక్షణ లభిస్తుందని ఆయన వివరించారు. ఈ అంశంలో సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలను ఆయన సూటిగా, గట్టిగా తిప్పికొట్టారు.
సెక్షన్ 17 ఏ కింద కేవలం అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులకే కాకుండా అన్ని రకాల కేసులకు వర్తిస్తుందని.. దీని ప్రకారం విచారణ చేపట్టే ముందు సంబంధిత ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని వివరించారు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో పలువురు అధికారుల పాత్ర ఉన్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. అలా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యవహరించిందో సాల్వే వివరించారు. అధికారులపై స్కిల్ కేసులో విచారణ చేపట్టాలనుకుంటే తప్పక గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి వస్తుందని.. అందుకు గవర్నర్ అనుమతించరు కనుకనే అధికారులను తప్పించారని సాల్వే అన్నారు.
ఎన్నికల తరుణంలో కక్షపూరిత కేసులతో ప్రత్యర్థులను వేధించటాన్ని నిరోధించటానికే సెక్షన్ 17 ఏ ని పొందుపరచారని.. అయితే రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవటం నా హక్కు అని కొందరు ముఖ్యమంత్రులు భావిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని సాల్వే కోర్టుకు తెలిపారు.
సెక్షన్ 17 ఏ జులై 2018 కి ముందు నుంచి కూడా వర్తిస్తుందని చెబుతూ హరీష్ సాల్వే పలు సుప్రీం కోర్టు తీర్పులను ఉదహరించారు. రతన్ లాల్ కేసులో.. 17 ఏ వర్తింపు విషయంలో సందిగ్ధత ఉంటే నిందితుని యొక్క స్వేచ్ఛను రక్షించే విధంగా దానిని అన్వయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అలాగే ఆర్ ఆర్ కిశోర్ కేసులో సెక్షన్ 17 ఏ కేవలం అవినీతి నిరోధక కేసులకే కాకుండా అన్ని రకాల కేసులకు వర్తిస్తుందని ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ ఈ విషయంలో రోహత్గీ చేసిన వాదనను తిప్పికొట్టారు. సీఐడీ న్యాయవాది రోహత్గీ నిన్న ఒక కొత్త కోణం నుంచి వాదిస్తూ.. 17 ఏ వర్తింపు విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఎఫ్‌ఐఆర్ లో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో విచారణ కొనసాగవచ్చని వాదించారు.
ఏ శ్రీనివాసరెడ్డి కేసులో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం సెక్షన్ 17ఏ కింద ఉన్నత అధికారుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి అని స్పష్టం చేసిందని.. ఈ అంశంపై ఒకసారి చేసిన వాదనను 6 సార్లు చెప్పినా నిలబడదని సాల్వే చురక వేశారు.
సెక్షన్ 17 ఏ నేర విచారణ పద్ధతికి సంబంధించినది మాత్రమే కాకుండా నిందితునికి కొన్ని అదనపు ప్రయోజనాలు కలిగించే విస్తృతి పరిధిగల వ్యవస్థ కనుక ఇది 2018 తర్వాత చేపట్టే కేసులకే అన్వయిస్తుందని సీఐడీ న్యాయవాది రోహత్గీ వాదించగా.. చంద్రబాబు న్యాయవాది సాల్వే గట్టిగా ప్రతిఘటించారు. ప్రాస్పెక్టివ్ వర్తింపు (2018 తర్వాత అన్వయింపు) కు సంబంధించి తాము లేవనెత్తిన ఏ అంశానికి రోహత్గీ సరైన స్పందన ఇవ్వలేదని.. ఎందుకంటే ఆయన దగ్గర దానికి సమాధానం లేదని సాల్వే అన్నారు.
17 ఏ అమాయకులకు వర్తించదు, తప్పు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందన్నట్లుగా సీఐడీ న్యాయవాది వాదిస్తున్నారని సాల్వే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుపై మోపబడిన నేరం ఆయన అధికార విధులకు సంబంధించిందా కాదా అన్న విషయం ఏసీబీ కోర్టులో మాత్రమే తేల్చుకోవాలంటూ రోహత్గీ చేసిన వాదనలు విడ్డూరంగా ఉన్నాయని, విచారణ అనంతరం నిర్దోషిగా తేలితే ఇక గవర్నర్ చేసేది ఏముంటుందని, అంతకాలం తప్పు చేయనివారిని ఎలా వేధిస్తారని సాల్వే ప్రశ్నించారు.
ఎఫ్‌ఐఆర్ లో చంద్రబాబు పేరే లేదా అంటూ విస్తుపోయిన న్యాయమూర్తి
తమ వాదనలలో భాగంగా.. ప్రస్తుతం మనం ఒక వ్యక్తి (చంద్రబాబు)ని కాకుండా కేవలం ఎఫ్‌ఐఆర్ ని మాత్రమే చూడాలని రోహత్గీ వాదించగా.. అయితే ఎఫ్‌ఐఆర్ లో అసలు చంద్రబాబు పేరే లేదని హరీష్ సాల్వే తెలిపారు. ఔనా.. ఇప్పటిదాక ఎఫ్‌ఐఆర్ లో చంద్రబాబు పేరు ఉందనుకుంటున్నాము అంటూ న్యాయమూర్తి జస్టీస్ బేలా ఎం. త్రివేది వ్యాఖ్యానించగా.. ఔను ఆయన పేరు ఎఫ్‌ఐఆర్ లో లేదంటూ మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా ధర్మాసనానికి తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన రెండు సంవత్సరాల తరువాత చంద్రబాబును 37వ నిందితునిగా చేర్చారని ఆయన వివరించారు.
అరగంట చాలని గంటన్నర వాదించిన సీఐడీ న్యాయవాది
సుప్రీం కోర్టులో గత శుక్రవారంనాడు విచారణ సందర్భంగా కోర్టు సమయం ముగుస్తున్న వేళలో మరో అరగంటపాటు తమ వాదనను వినిపిస్తానన్న సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈరోజు ఇంతకు ముందు చెప్పిందే చెబుతూ సుమారు గంటన్నర సేపు వాదించారు. ఒకదశలో హరీష్ సాల్వే ఇది పద్ధతి కాదంటూ అభ్యంతరం తెలిపారు. తమ వాదనలో బలం లేనప్పుడు, విచారణను పొడిగిస్తూ జైల్లో ఉన్నవారిని ఏదో విధంగా ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టటానికి న్యాయస్థానాల్లో న్యాయవాదులు అనుసరించే ప్రక్రియ ఇదని కొందరు న్యాయ నిపుణులు తెలిపారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కోరిన సాల్వే
17 ఏ అంశంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఇతర పలు ఐపీసీ కేసులు ఆయనకు వ్యతిరేకంగా కొనసాగుతాయని సీఐడీ న్యాయవాది చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాదనలు ముగింపు సమయంలో 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు దాదాపు 40 రోజులుగా జైల్లో ఉన్నారని.. ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సాల్వే ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సీఐడీ తరపు మరో న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు.
సుప్రీం తీర్పు ఎప్పుడు రావొచ్చు?
దసరా పండగ సందర్భంగా ఈ శనివారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవుదినాలు. ధర్మాసనం ఈ శుక్రవారంలోగా తీర్పు ఇస్తుందా? లేక సెలవుల అనంతరం వెల్లడిస్తుందా అన్న చర్చ నడుస్తోంది. 17ఏ వర్తింపుపై శుక్రవారంలోగా తీర్పు ఇవ్వకుండా.. హరీష్ సాల్వే నిన్న కోరిన మేరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చి తుదితీర్పును సెలవుల అనంతరం వెల్లడిస్తుందా అన్న ప్రశ్నపై చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠ వీడడానికి మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పై శుక్రవారం విచారణ
ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు క్లుప్తంగా విచారణ జరిగింది. సమయాభావం వలన ఈ పిటిషన్ ను శుక్రవారంనాడు విచారిస్తామని, అప్పటి దాక చంద్రబాబును అరెస్టు చేయరాదని ధర్మాసనం తెలిపింది.