దశలవారీగా పేదరిక నిర్మూలనకోసం పక్కా ప్రణాళిక
మరింత విస్తృతితో సంక్షేమ పథకాల అమలు
దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే దిశగా వినూత్న పథకాలు
కుటుంబం ఒక యూనిట్ గా సూక్ష్మ ప్రణాళికలు
తెలుగుజాతి అభ్యున్నతే ధ్యేయంగా మరో విజన్ కు కసరత్తు రాష్ట్ర భవితను మలుపు తిప్పే చారిత్రక క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతున్నది. కేవలం అధికారం కోసం కాకుండా ఒక సామాజిక బాధ్యతతో తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రూపొందించు కుంటోంది. పేదరిక నిర్మూలన అనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆశయం. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ ఆశయ సాధన కోసం అకుంఠిత దీక్షతో నిరంతరం శ్రమిస్తున్నారు. విజన్ 2020 ద్వారా పేదరిక నిర్మూలన కృషికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు మరో 15 సంవత్సరాలలో తెలుగుజాతి దిశను, దశను మార్చే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు. మరికొద్ది రోజుల్లో జరుగనున్న మహానాడులో ఆ దిశగా మరో ముందడుగు పడనున్నది. దశల వారీగా పేదరిక నిర్మూలనకు సంబంధించిన ప్రణాళిక ను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు.
ఒక రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని పరిరక్షిస్తూనే, ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాన్ని పెంపొందించే దిశగా సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యం పాటిస్తూ, ఒక నిర్దిష్ట ప్రణాళిక ద్వారా సామాజిక విప్లవానికి చంద్రబాబు నాంది పలుకనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక అమలు జరుపాలనేది చంద్రబాబు యోచనగా వున్నది.
సంక్షేమం అన్న పదానికి బీజం వేసిన తెలుగుదేశం పార్టీ, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నది. సంక్షేమం అనేది తాత్కాలిక ఉపశమనం గా కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలనేది చంద్రబాబు ఆకాంక్ష. దానికి భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా, అవినీతికి తావులేని విధంగా, రాజకీయాలకు అతీతంగా అర్హులు అందరికీ చేరే విధంగా విస్తృత స్థాయిలో అమలు చేయనున్నట్టు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఆ దృష్టితోనే దారిద్య్రరేఖకు దిగువన వున్న వారికి అన్నిరకాల సంక్షేమ ఫలాలు అందిస్తూనే వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ప్రణాళిక రచిస్తున్నారు.
తొలిదశలో దారిద్ర్య రేఖకు దిగువనున్న , మధ్య తరగతి ప్రజానీకం పై దృష్టి సారిస్తారు. వారందరినీ దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకు రావాలనేది చంద్రబాబు సంకల్పం గా వుంది. రెండవ దశలో పెరిగిన ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధిని సుస్థిరం చేసి, ప్రతి ఏటా పెరిగే విధంగా చర్యలు చేపట్టనున్నారు. మూడవ దశలో తెలుగు ప్రజలను దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వర్గాలుగా తీర్చిదిద్దుతారు. చంద్రబాబు చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటికే ప్రవాసులలో విజయవంతం అయింది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా వంటి చోట్ల తెలుగు ప్రజల తలసరి ఆదాయం అక్కడి స్థానికులు కంటే ఎక్కువగా వుండటం విశేషం. అమెరికన్ ల సగటు తలసరి ఆదాయం 64 వేల డాలర్లు వుంటే, అక్కడి తెలుగు ప్రజల సగటు ఆదాయం 1.29 వేల డాలర్లు కు చేరుకుంది.
మరో దశాబ్దకాలంలో ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన యూదులను మించి పోగలదని అంచనా. ఇదే విధంగా చంద్రబాబు రూపొందించిన విజన్ ఫలితంగా ఎన్నో దేశాలలో తెలుగు ప్రజలు ఉద్యోగాల కోసం వెళ్లి, అక్కడ వేలాదిమంది కి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. దీనికంతటికీ చంద్రబాబు దార్శనికతే కారణం అనటంలో సందేహం లేదు. అదే క్రమంలో భారత దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజానీకాన్ని పైకి తీసుకు రావాలనే చంద్రబాబు యోచన గా వుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని చంద్రబాబు ఒక బృహత్ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.