- పట్టణాల్లో అభివృద్ధి కొనసాగాలంటే కూటమి పాలకవర్గం అవసరం
- పాలకొల్లులో పలువార్డుల్లోని ఎస్సీ ప్రాంతాల్లో మంత్రి నిమ్మల విస్తృత ప్రచారం
పాలకొల్లు (చైతన్యరథం): మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే పాలకొల్లు పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలంటే మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం ఏర్పడటం అవసరమని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 33, 32, 41, 10, 11, 12, 16 వార్డుల్లో ఎస్సీ ప్రాంతాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ రెండేళ్లలో ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధితోపాటు గత టీడీపీ ప్రభుత్వంలో తాను చేసిన తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎస్సీల అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
పాలకొల్లులో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయని, గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేని వైసీపీ నాయకులు ఇప్పుడు చేస్తామంటూ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు తీసుకొస్తూ, ఆదివారం, సెలవు రోజులు అనే తేడా లేకుండా రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని తెలిపారు.
మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవకుడిగానే పనిచేస్తున్నానని నిమ్మల అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే నాయకుడికి, గతంలో పనిచేయని వైసీపీ నాయకులకు మధ్య ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు.
కూటమి చైర్పర్సన్ అభ్యర్థి ఆబోతుల ఉషారాణితో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరారు. మున్సిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని, అక్కడి సమస్యలను దశలవారీగా ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీకి ఓటు వేస్తే అది సముద్రంలో వేసినట్టేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. పాలకొల్లు పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


















