- జీవనోపాధి కల్పిస్తూ అభ్యున్నతి బాటలో నడిపించేలా తోడ్పాటు
- ఆక్వా రంగాన్ని బలోపేతం చేసి బ్లూ ఎకానమీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నాం
- మత్స్యకార దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి (చైతన్యరథం): మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పెన్షన్, వేట నిషేధ సమయంలో భృతి ప్రకటించిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుదేనన్నారు. వేట నిషేధ భృతిని ఇప్పుడు ఏకంగా రూ.20 వేలు అందించడం మత్స్యకారుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారికి నెల రోజుల్లోపే డెత్ సర్టిఫికెట్ అందించి, ఆర్ధిక సాయం అందిస్తున్నాం.
మత్స్యకారుల హక్కుల్ని హరించేలా చెరువులు, రిజర్వాయర్లను హస్తగతం చేసుకునేలా గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.217ను.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రద్దు చేశాం. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ అందిస్తున్నాం. ఆక్వా రంగానికి రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నాం. ఆక్వా రంగాన్ని బలోపేతం చేసి బ్లూ ఎకానమీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నాం. వైసీపీ ఐదేళ్ల పాలనలో మత్స్యకారుల సంక్షేమాన్ని, అభివృద్ధిని నాశనం చేశారు. సంక్షేమం మాటున వారి జీవితాలను బుగ్గి చేయాలని ప్రయత్నించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం. అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం. మత్స్యకారులు వేటపై మాత్రమే ఆధాపడకుండా.. మత్స్య ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తున్నాం. తాజాగా సీ వీడ్ తయారీలో కూడా మత్స్యకార మహిళలకు శిక్షణ అందించేలా చర్యలు చేపట్టామని మంత్రి రవీంద్ర తెలిపారు.


















