- మూడు రోజులైనా చేలల్లోంచి కదలని నీరు
- నీటిలో నానుతున్న వరి
అమరావతి : మిచౌంగ్ తుఫాన్ మిగిల్చిన విషాదం నుంచి రైతాంగం తేరుకోలేదు. చెరువులను తలపిస్తున్న పంట చేలను చూస్తూ రైతులు కన్నీరుమున్నీరవు తున్నారు. మూడు రోజులైనా చేలల్లోంచి నీరు బయటకు పోకపోవటంతో నీటిలో నానుతున్న పంటను చూసి రైతు గుండె బరువవుతోంది. తుఫాన్ కారణంగా వీచిన గాలులు, వర్షానికి వరి పంట మొత్తం నేలకొరిగిపోయింది. గత మూడు రోజులుగా వర్షంలో నాని ఉండడంతో ధాన్యం మొలకలు వస్తున్న పరిస్థితి. పంట కోసి నూర్పిళ్లు చేస్తే కనీసం ఖర్చులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల పంటను రైతులు ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కప్తానుపాలెంలో ఆరు ఎకరాల పంటను రైతు గంటా సుబ్బారావు ఆవేదనతో దమ్ము చేయించాడు. ఆరుగాలం కష్టించి పండిరచిన పంటను ట్రాక్టర్‌తో తొక్కించేయడం బాధగా ఉందని వాపోయాడు.
ప్రకృతి విపత్తులను మనం అడ్డుకోలేం. అయితే పాలకులు ముందుచూపుతో వ్యవహరిస్తే విపత్తుల వల్ల జరిగే నష్టాలను తగ్గించవచ్చు. గత చంద్రబాబు ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఆలోచించి అందుబాటులోకి తెచ్చిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించటం ప్రస్తుతం రైతుల పాలిట శాపంగా మారింది. అదే సమయంలో పొలాల్లోంచి మురుగునీరు బయటకు వెళ్లే డ్రైనేజీ వ్యవస్థను కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం మరో ఘోర తప్పిదం. మురుగు కాలువలు పూర్తిగా పూడికతో నిండిపోయినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు రైతులను నిండా ముంచేసింది.
తుఫానులు వచ్చేలోగా వరి పంట ఇంటికి వచ్చేలా పంట సీజన్‌ను ముందుకు జరపడంలో గత చంద్రబాబు ప్రభుత్వం చూపించిన చొరవను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేశారు. జగన్ పాలనలో యువతకు ఉపాధి చూపే పారిశ్రామిక రంగమైనా, ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే వ్యవసాయ రంగమైనా నిర్లక్ష్యానికి గురవడం సాధారణ విషయంగా మారిపోయింది.
చంద్రబాబు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి కృష్ణా డెల్టా రైతులకు జూన్ మెదటివారంలోనే నీటిని విడుదల చేసింది. వెంటనే నారు పోసుకుంటే జులైలో నాట్లు పూర్తి చేసుకోవచ్చు.
నవంబరులోగా వరి కోతలు పూర్తవుతాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌ల్లో వచ్చే తుఫాన్ల నుంచి పంటను కాపాడవచ్చు. రైతులు పట్టిసీమ ఫలాలను పూర్తిస్థాయిలో అందుకునే దశలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి జగన్ రెడ్డి అధికారంలోకి రావటంతో పరిస్థితి మళ్లీ మెదటికి వచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక కూడా జూన్ లోనే నీటిని విడుదల చేస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు జరగటం లేదు.
సాధారణంగా నవంబరు, డిసెంబర్ నెలల్లో తుఫాన్లు వస్తుంటాయి. ఈలోగా వరి కోతలు పూర్తయితే రైతుల్ని భారీ నష్టం నుంచి కాపాడవచ్చు. జగన్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచనే చేయడం లేదు. దీని కారణంగానే ప్రస్తుత ఏడాది కూడా లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోవాల్సివచ్చింది. నూర్పిడి చేసి ఒడ్డుకు చేర్చిన లక్షల టన్నుల ధాన్యం తడిసింది. పది, పదిహేను రోజుల ముందే కోతలు ముగిసి ఉంటే ఈ నష్టం తప్పేదని రైతులు వాపోతున్నారు.
అదే సమయంలో అత్యంత కీలకమైన కాలువల మరమ్మతులను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. వాటి నిర్వహణకు నిధులు కూడా ఇవ్వడం లేదు. దీంతో కాలువలు ఎక్కడికక్కడే పూడికతో నిండిపోయాయి. నీరు విడుదల చేసినా పొలాలకు సక్రమంగా నీరందటం లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఈ కారణంగానే గతేడాది డెల్టాలో కొన్ని చోట్ల పంట విరామం కూడా ప్రకటించడం గమనార్హం.
జగన్ పాలనలో పంట కాలువలు, మురుగునీటి డ్రైన్లు బాగు చేయకపోవడం వల్ల చేలల్లో నీరు త్వరగా బయటకు వెళ్లే వీలు లేక పంట కుళ్లిపోతోంది. కోతకోసిన వరిపనలు నీటిలో తేలియాడుతుండగా, మరికొంత మేర కోత కోయని వరి నేలవాలి నీటిలో నానుతోంది. కుప్పలు వేసిన పొలాల్లో నీరు నిలిచి కుప్పల్లోకి నీరువెళ్లి తడిసిపోగా, యంత్రాలతో కోతకోసి రోడ్లపక్క ఎండబెట్ఠిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పట్టాలు కప్పి రైతులు తంటాలు పడినప్పటికి వర్షపునీరు నిలబడి మొలకలు వస్తున్నాయి.
వర్షం ఆగడంతో పొలాల్లో నీరు బయటకు పోయేందుకు, ధాన్యం రాశుల వద్ద నీటిని తొలగించే ప్రయత్నంలో రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా పొలాల్లో వేసిన మినుము విత్తనాలు నీటిలో కుళ్లిపోగా మరలా విత్తనాల కోసం రైతులు పరుగులు పెడుతున్నారు. పలువురు రైతులు ఆయా గ్రామాల్లోని ఆర్‌బీకేల వద్దకు వెళ్లి ధాన్యం కొనాలని కోరుతుంటే ఆరబెట్టి తీసుకురావాలని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. 17 శాతం కన్నా ఎక్కువ తేమ ఉందని ధాన్యం కొనుగోలు చేయటం లేదు.
తేమ శాతం ఆంక్షలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ ఏడాది కృష్ణా డెల్టాలో భూములకు వరి పొట్టపోసుకునే దశలో నీటి ఎద్దడి ఎదురైంది. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడి వేలాది రూపాయలు వ్యయం చేసి ఆయిల్ ఇంజన్లద్వారా నీటిని పొలాలకు పారించుకుని పంటలు కాపాడుకున్నారు. పంట చేతికందే దశలో మిచౌంగ్ తుఫాన్ విరుచుకుపడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది.