- మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్
- శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్
- రూ.1,167 కోట్ల వ్యయంతో నిర్మాణం
మంగళగిరి(చైతన్యరథం): నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ఎంటీఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రేనేజీ వ్యవస్థ నిర్మించి మురుగు కనుమరుగయ్యేలా చేస్తామని గత ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. తాడేపల్లిలోని పాతూరు రోడ్డులో మంగళగిరి, తాడేపల్లి నగర ప్రజల చిరకాల కోరిక అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి పథకం మొదటిదశ పనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పాతూరు రోడ్డుకు చేరుకున్న లోకేష్ టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికా రు. ప్రజా ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. తొలి ప్రాధాన్యంగా భూగర్భ డ్రైనేజీ డీపీఆర్‌లు రూపొందించారు. నిధులు మంజూరు తో పాటు పరిపాలన అనుమతులు తీసుకువచ్చారు. దీంతో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
రెండు దశల్లో జరగనున్న పనులు
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ(యూజీడీ)ను రూ. 1,167.50 కోట్లతో నిర్మించనున్నారు. రాజధాని గ్రామాలు బేతపూడి, నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాలు మినహా మొత్తం ఎంటీఎంసీ ప్రాంతంలో డీసెంట్రలైజేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మాణాన్ని హైబ్రిడ్ అన్యుటీ మోడ్‌లో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. యూజీడీ నెట్ వర్క్ ఫేజ్-1లో 300 కి.మీ, ఫేజ్-2లో 231 కి.మీ కలిపి మొత్తం 531 కి.మీ నిర్మించ నున్నారు. మురుగు నీటిశుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ) ఫేజ్-1లో 7, ఫేజ్-2లో 13 కలిపి మొత్తం 20 నిర్మించనున్నారు. వీటిని మొత్తం 20 జోన్లుగా విభజించారు. ఒక ఎంఎల్‌డీ (రోజుకు పది లక్షల లీటర్లు) కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఎస్ బీఆర్(Sదీ=) సాంకేతికత ఆధారిత ఎస్టీపీలు 14 కాగా, ఒక ఎంఎల్డీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన ఎఫ్‌బీ టెక్ ప్యాకేజ్డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు 6 ఉండనున్నాయి.
రోడ్ల పునరుద్ధరణతో కలిపి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1,167.50 కోట్లు కానుంది. మొదటి దశలో రూ.604.32 కోట్లు, రెండో దశలో రూ.563.18 కోట్లు వెచ్చించ నున్నారు. ఎస్టీపీ సామర్థ్యం మొదటి దశలో 26.48 ఎంఎల్డీ, రెండో దశలో 21.03 ఎంఎల్‌డీ కలిపి మొత్తం 47.51 ఎంఎల్డీ కానుంది. లిఫ్ట్ స్టేషన్లు మొదటి దశలో 4, రెండో దశలో 14 కలిపి మొత్తం 18 నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, రూరల్ అధ్యక్షుడు దాసరి కృష్ణతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

















