- ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు
- మేనేజ్మెంట్ కేటగిరీలో 50, సీ,డీ కేటగిరీ ఉద్యోగాల్లో 75 శాతం
- కొత్తబిల్లు ఆమోదించిన కర్ణాటక మంత్రివర్గం
- సాఫ్ట్వేర్ కంపెనీలు తరలిపోతాయని నాస్కామ్ ఆందోళన
- వెంటనే స్పందించిన రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్
- విశాఖకు రావాలని ఆహ్వానం
అమరావతి(చైతన్యరథం): ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలన్న బిల్లుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలపడంపై నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి రిజర్వేషన్ల వల్ల కంపెనీల్లో నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడతుందని ఆందోళన వ్యక్తం చేసింది. స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ వల్ల ప్రతిభావంతులైన ఉద్యోగులు లేక పనితీరు కుంటుపడుతుందని, తద్వారా సాఫ్ట్ వేర్ కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఉందని నాస్కామ్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని ఏపీకి అనుకూలంగా మలచుకునేలా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. నాస్కామ్కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024` పారిశ్రామిక బిల్లుపై నాస్కామ్ అసంతృప్తిని అర్థం చేసుకున్నామని లోకేష్ పేర్కొన్నారు.
ఏపీలో ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్‌కి వ్యాపారాలను విస్తరించుకోవచ్చన్నారు. విశాఖలో ఏఐ, డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసుకోవచ్చని ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆంక్షలు లేని విధంగా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాస్కామ్ సంస్థలకు నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను అందిస్తామని లోకేష్ తెలిపారు. ఐటీ రంగంలోనే అత్యుత్తమ స్థాయి సౌకర్యాలను మీకు కల్పిస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. మీ ఐటీ వ్యాపారాలకు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉంది. దయచేసి మమ్మల్ని సంప్రదించండి అంటూ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కర్ణాటక కేబినెట్ ఓ కొత్త చట్టాన్ని ఆమోదింది. దాని ప్రకారం ప్రైవేటు సంస్థలు హై స్కిల్డ్ ఉద్యోగాల్లో అయినా సరే.. 50 శాతం మందిని కర్ణాటక వాసులనే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థలో నాన్ మేనేజ్మెంట్ (సీ,డీ) కేటగిరీలో 75 శాతం, మేనేజ్మెంట్ కేటగిరీలో 50 శాతం ఉద్యోగాలను కర్నాటక ప్రభుత్వం గుర్తించిన స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై అసెంబ్లీలో బిల్లు తెచ్చి ఆమోదించడానికి సర్వం సిద్ధమయింది. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకి పుట్టినిల్లుగా ఉన్న బెంగళూరులో ఇలాంటి నిబంధన పెడితే.. ఇక మీదట ఒక్క కంపెనీ కూడా రాదు కదా..ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీపై ఇలాంటి ఆంక్షలు పెడితే కష్టమని తేల్చి చెబుతూ.. కర్ణాటక ప్రభుత్వానికి సాఫ్ట్వేర్ కంపెనీల సంఘం నాస్కాం ఓ లేఖ రాసింది. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరింది. కర్ణాటక స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్ 2024 మంత్రి వర్గం ఆమోదం పొందడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని తెలిపింది. అందులో ఉన్న నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.
అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న వేళ తాజా బిల్లులోని నిబంధనలతో అవి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే, బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తీవ్ర పోటీతత్వం నెలకొన్న నేటి తరుణంలో ఆంక్షలు విధిస్తే… నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడి, సంస్థలు వేరే చోటుకి తరలిపోవచ్చు అని నాస్కామ్ పేర్కొంది.
ఇదే అంశంపై ప్రైవేటు రంగ నిపుణులు, సంస్థల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ హెచ్చరించారు. సాంకేతిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లుని అనుమతించకూడదని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సూచించారు. నైపుణ్యమున్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు వెంటనే నారా లోకేష్ స్పందించారు. ఐటీ కంపెనీలకు విశాఖ ఆహ్వానం పలుకుతోందన్నారు. బ్యూటిఫుల్ సిటీగా ఇప్పటికే విశాఖకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. ఇప్పుడు లోకేష్ చొరవతో ఐటీ కంపెనీల దృష్టి పడితే సాగర నగరం దశ తిరిగినట్లే.
వెనక్కి తగ్గిన కర్ణాటక
ఇలాఉంటే తీవ్ర విమర్శల నేపథ్యంలో ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు వేసింది. పరిశ్రమవర్గాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు బుధవారం రాత్రి పొద్దు పోయాక వెల్లడించాయి. ప్రైవేటు సంస్థల్లో కోటా అంశం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆ బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తాజా ప్రకటన వెలువడింది.