- ప్రాణాపాయం నుంచి బయటపడేసిన మంత్రి లోకేష్
- ప్రజాదర్బార్‌లో వినతికి తక్షణం స్పందించిన వైనం
- మంత్రి లోకేష్ చొరవతో శిశువుకు కొత్త ఊపిరి
- మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
అమరావతి (చైతన్య రథం): ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ 14 రోజుల పసికందుకు పునర్జన్మిచ్చింది. తమ బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, వైద్య సాయంచేసి ఆదుకోవాలంటూ ప్రజాదర్బార్‌కు తరలివచ్చి వేడుకున్న ఆ తల్లిదండ్రులకు లోకేష్ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించి పసికందు ప్రాణాలు కాపాడారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చదల వెంకట మహేశ్వరరావుకు రెండో సంతానంగా మగ శిశువు జన్మించాడు. 14 రోజులకు శిశువు రాత్రిళ్లు ఏడుస్తుండటం, పాలు తాగకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే శిశువుకు ప్లేట్ లెట్స్ పడిపోయి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసం విజయవాడకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్సకు భారీగా ఖర్చవుతుందని తెలిపారు. గిరిజనుడైన మహేశ్వరరావు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడం, మరోవైపు కన్నబిడ్డకు మృత్యువు ముంచుకొస్తుండటంతో ఎటూ పాలుపోని పరిస్థితి. దీంతో మిత్రుడి సలహా మేరకు గత నెల 27న అర్థరాత్రి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసం వద్దకు చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్‌ను కలిసి మరో 5 నిమిషాల్లో తన బిడ్డ చనిపోతాడని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి లోకేష్.. వైద్యానికి అవసరమైన సాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించి శిశువు ప్రాణాలను నిలిపారు. 14 రోజులపాటు చికిత్స పొంది తమ బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. నేటి ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్‌ను కలిసి ఆయన చేసిన సాయంపట్ల కృతజ్ఞతలు తెలిపారు. తాము జన్మజన్మలా రుణపడి ఉంటామని కన్నీటిపర్యంతమయ్యారు. ధైర్యంగా ఉండాలని, అన్నివిధాల అండగా ఉంటామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.