- చొరవ చూపించి ఇచ్చిన మాట నిలుపుకున్న లోకేష్
- ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించిన సిబ్బంది
- అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా 300 మందికి పదోన్నతులు
- మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన హెడ్ కానిస్టేబుళ్లు
అమరావతి (చైతన్య రథం): సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానంటూ భరోసా ఇస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏళ్ల తరబడి పెండింగ్‌లోవున్న తమ పదోన్నతుల సమస్య పరిష్కరించాలంటూ ప్రజాదర్బార్‌లో తనను కలిసి ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు చేసిన విజ్ఞప్తిపట్ల మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. వారికి అండగా నిలిచారు. మంత్రి లోకేష్ చొరవతో ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా 300మందికి పదోన్నతులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ 2014-19 మధ్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఏపీఎస్పీ సిబ్బందికి మాత్రం పదోన్నతులు నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన జగన్‌రెడ్డి ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ స్పందన లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన సిబ్బంది.. తమ సమస్య పరిష్కరించాలంటూ విన్నవించారు. అండగా ఉంటామంటూ మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాట నిలుపుకుంటూ పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి అమలులో చొరవ చూపారు. పదోన్నతులు కల్పించి 300మంది కుటుంబాల్లో ఆనందం నింపడంపట్ల ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది మంత్రి లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.














