హైదరాబాద్ (చైతన్యరథం): హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకల్లో సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన పలువురిని సన్మానించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం అందించడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, తలసేమియా బాధితులకు అండగా నిలిచిన సేవాదాతలను గౌరవించారు. ముఖ్యంగా గుడివాడ, మచిలీపట్నం పామర్రు మండలం నిమ్మకూరు, తోట్లవల్లూరు,పెనమలూరు వంటి ప్రాంతాల్లో ట్రస్ట్ తరఫున విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తిని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ అవార్డును అందజేసి నారా భువనేశ్వరి ప్రత్యేకంగా సన్మానించారు.
ఆయన నేతృత్వంలో సుమారు 1200 మందికి పైగా రక్తదానం చేయించడం, వేలాది మందికి ఉచితంగా మందులు, కళ్లజోళ్ల పంపిణీ చేయడం, కంటి ఆపరేషన్లు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సుమారు 2500 మంది పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేస్తూ విద్యా రంగానికి కూడా ఆయన విశేష తోడ్పాటు అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయా రంగాల్లో సేవలందించిన 50 మంది మహిళలను జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది.















