- ‘రైజింగ్ రాయలసీమ’ కూటమి ప్రభుత్వ లక్ష్యం
- కర్నూలులో గోల్డ్ మైనింగ్, డ్రోన్ సిటీ..
- తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్
- రాయలసీమకు భారీ మౌలిక వసతులు
- మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ మంత్రి సవిత
మంగళగిరి (చైతన్య రథం): ఎన్నికల సమయంలో “నా బీసీలు” అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఉక్కుపాదంతో అణచివేశారని మంత్రి సవిత ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు నిలిపివేశారని, ఆదరణ పథకాలను రద్దు చేశారని విమర్శించారు. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, బాపట్ల జిల్లాలో అమర్‌నాథ్‌గౌడ్ వంటి బీసీల హత్యలు జరిగాయని, అనేకమంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతోపాటు తనపైనా, సామాన్య బీసీ కార్యకర్తలపైనా తప్పుడు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.
‘రైజింగ్ రాయలసీమ’ సీఎం చంద్రబాబు లక్ష్యం
రాయలసీమను హార్టికల్చర్, ఐటీ, పరిశ్రమలు, డిఫెన్స్, పర్యాటకం, డ్రోన్ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు, అంటే రూ.85 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాయలసీమకే వచ్చాయని వెల్లడించారు. కడప జిల్లాలో భారీ ప్రాజెక్టులు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్లతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. 2028 నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించి సుమారు 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం లక్ష్యమని చెప్పారు. టి.కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని, అదానీ సంస్థ రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. స్థానిక యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ‘స్టార్టప్ కడప’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.
కర్నూలులో గోల్డ్ మైనింగ్, డ్రోన్ సిటీ
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో భారతదేశంలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు రూ.406 కోట్లతో ప్రారంభమై వాణిజ్య ఉత్పత్తి చేపట్టిందని మంత్రి తెలిపారు. అదే విధంగా ఓర్వకల్లులో అత్యాధునిక డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక ప్రాంతంలో భారీ బెవరేజెస్ తయారీ యూనిట్ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు.
శ్రీసత్యసాయిలో డిఫెన్స్ హబ్
పుట్టపర్తిలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో రూ.15,800 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. అదే జిల్లాలో రిలయన్స్ సంస్థ రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్, గ్రిడ్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.
తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్
తిరుపతిలో రూ.2,508 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏడాది వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అన్నమయ్య-తిరుపతి జిల్లాల సరిహద్దులో స్క్రీన్ సిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతిని ఐటీ హబ్‌గా, తిరుపతి-కడప ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
రాయలసీమను శాశ్వత కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు, వెలిగొండ వంటి సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని, వాటిని పూర్తి చేసేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆమె పేర్కొన్నారు.
రాయలసీమకు భారీ మౌలిక వసతులు
రాయలసీమ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకొస్తోందని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ, గత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
బెంగళూరు–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ పరిధిలోకి వచ్చే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రహదారులు, కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాయలసీమలో పరిశ్రమలు, ఐటీ, డిఫెన్స్, వ్యవసాయం, పర్యాటక రంగాలకు అనుగుణంగా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మంత్రి, రాయలసీమ అభివృద్ధిపై ఆయనకు ఆసక్తి లేదన్నారు. “ఒక సైకో రెడ్డి ఉన్నాడు… ఆయనకు అభివృద్ధి పట్టదు. రక్తం చూస్తేనే ఆయనకు తెల్లారుతుంది… శవాలు చూస్తేనే పూట గడుస్తుంది. ఆయన విజన్ విధ్వంసం, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలైతే… మా నాయకుడు చంద్రబాబు నాయుడు విజన్ అభివృద్ధి, సంక్షేమం, ప్రపంచంలో తెలుగువారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టడం” అని వ్యాఖ్యానించారు.
‘రాయలసీమ ద్రోహి జగన’
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో 102 రాయలసీమ అభివృద్ధి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12,441 కోట్లు ఖర్చు చేయగా, జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే వ్యయం చేసిందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఇంకా భారీగా నిధులు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ రైతాంగం, ప్రజల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.
పరిశ్రమలను తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వమే :
గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని మంత్రి విమర్శించారు. “జే ట్యాక్స” పేరుతో ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని ఆరోపించారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు కేవలం టెంకాయ కొట్టి వదిలేసిందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చిందని చెప్పారు.
రతనాల సీమగా తీర్చిదిద్దడమే లక్ష్యం :
రాయలసీమ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైన అభిమానం ఉందని మంత్రి తెలిపారు. ఒకప్పుడు రాయలవారు పాలించిన ఈ ప్రాంతాన్ని మళ్లీ “రతనాల సీమ”గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, ఐటీ, డిఫెన్స్, విద్య, పర్యాటకం, హార్టికల్చర్ వంటి అన్ని రంగాల్లో రాయలసీమకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గతంలో అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలు నేడు పెట్టుబడుల గమ్యస్థానాలుగా మారుతున్నాయంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వమే కారణమని మంత్రి సవిత పేర్కొన్నారు.
















