అమరావతి (చైతన్య రథం): తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈనెల 20నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సీఎం చర్చించారు. వివిధ అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, కేంద్రంనుంచి రావాల్సిన నిధులు, నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలు, రాజధాని నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై చంద్రబాబు సూచనలు చేశారు.
రాయలసీమకు సాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన గోదావరి-పెన్నా అనుసంధాన ప్రక్రియ, కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, రైల్వే భూముల కేటాయింపు, జోన్ పూర్తిస్థాయి కార్యకలాపాల ప్రారంభం అంశాలపై చర్చించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టే వివిధ చట్ట సవరణలు, కొత్త బిల్లులపట్ల పార్టీ అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు, ఎస్ఐఆర్ అంశాలపై నేతలతో సీఎం చర్చించారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారం, ఫేక్ న్యూస్ కట్టడి, వ్యవస్థలపై జరుగుతున్న దాడుల అంశాల్లో పార్లమెంట్ వేదికగా లేవనెత్తే విషయంపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఎంపీలు తమ నియోజకవర్గాల సమస్యలు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.















