రాజమహేంద్రవరం (చైతన్య రథం): “కాలుష్యరహిత గోదావరి” అనే లక్ష్యంతో రాబోయే పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్‌నుంచి పడవపై బయలుదేరిన ఆయన గోదావరి తీర ప్రాంతంలో కాలుష్య పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పుష్కరాల పనుల పురోగతిని అంచనా వేసిన ఉప ముఖ్యమంత్రి, నల్లా ఛానల్‌నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్య కారక వ్యర్థాలపై అధికారులను నిలదీశారు. గోదావరి పేపర్ మిల్ వ్యర్థ జలాలు ఎక్కడ శుద్ధి అవుతున్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్యను ప్రత్యేకంగా ప్రశ్నించారు. నల్లా ఛానల్ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్, రోజువారీ వ్యర్థాలను వేరు చేసే విధానం, మురికి నీటి శుద్ధి పద్ధతి, శాస్త్రీయ ప్రమాణాలు పాటిస్తున్నారా? అన్న విషయాలపై సవివరమైన వివరణ కోరారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాజమహేంద్రవరంలో గృహాలనుంచి రోజూ సుమారు 55 మిలియన్ లీటర్ల మురుగునీరు విడుదల అవుతోందని, అందులో కేవలం 15 శాతం మాత్రమే సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి అవుతోందని తెలిసింది. ఈ సమాచారం తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి, కేంద్రంనుంచి అందే నిధులను పారదర్శకంగా వినియోగించుకుని, మురుగు నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి వదలాలని స్పష్టమైన సూచన చేశారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పుష్కరాల పనుల వివరాలను డిప్యూటీ సీఎంకు నివేదించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సి సోము వీర్రాజు, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు గోదావరి జల కాలుష్య నియంత్రణ, గట్టు సుందరీకరణ, గట్లు పటిష్ఠీకరణ పనులకు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. గోదావరి నదిని పరిశుద్ధంగా కాపాడటం కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాంశమని, పుష్కరాల నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.















