- రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత
- పేదల విద్యకు ప్రోత్సాహమివ్వాలన్నది నా తండ్రి ఎస్సార్సార్ ఆశయం
- ఆయన పేరు మీద ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నాం
- కూటమి రాకతో ప్రభుత్వ విద్యకు మహర్దశ
- ఎస్సార్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానం
- 84 మంది విద్యార్థులకు రూ.36 లక్షల నగదు పురస్కారాలు
- టెన్త్‌లో 580 మార్కులు సాధించిన 26 మందికి రూ.25 వేలు
- ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన 59 మందికి రూ.50 వేల ప్రోత్సాహకం
పెనుకొండ/శ్రీ సత్యసాయి (చైతన్య రథం): విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలానికి చేరుకోగలమని, సామాజిక, రాజకీయ గుర్తింపూ లభిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్సార్సార్ ట్రస్ట్ ద్వారా పేదల విద్యకు ప్రోత్సహిస్తున్నామన్నారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి టెన్త్, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యతోనే అన్ని విధాలా గుర్తింపు లభించడమే కాకుండా పేదరికాన్ని సులభంగా అధిగమించవచ్చునన్నారు. తన తండ్రి, మాజీ మంత్రి ఎస్. రామచంద్రారెడ్డి పేరు మీద ఎస్సార్సార్ ట్రస్ట్ స్థాపించి విద్యలో రాణిస్తున్న పేద విద్యార్థులకు ప్రోత్సాహమిస్తున్నామన్నారు. ఏటా ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. విద్యార్థులకు మార్కులే ముఖ్యం కాదని, నైతిక విలువలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. కురుబలు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని మంత్రి సవిత ఆకాంక్షించారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యా రంగం గాడిన పడిందని మంత్రి సవిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులతో అత్యుత్తమ బోధన అందిస్తున్నారన్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనంతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎందరు విద్యార్థులుంటే అందరికీ రూ.15 వేల చొప్పున అందజేస్తున్నామన్నారు. ఎంజేపీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు విద్యా బోధనతో పాటు క్రీడల్లోనూ రాణించేలా స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు కూడా ఇస్తున్నామన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ వంద రోజుల ప్రణాళికతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు టెన్త్, ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల కంటే అత్యధిక ఫలితాలు సాధించారన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో రక్షణతో కూడిన అత్యుత్తమ బోధన అందిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు.
84మంది విద్యార్థులకు రూ.36 లక్షల నగదు పురస్కారాలు
తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్సార్సార్ ట్రస్ట్ ద్వారా రాయలసీమకు చెందిన 84 మంది కురుబ, కురుమ, కురవ విద్యార్థులకు రూ.36 లక్షల నగదు పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్త్‌లో 580 మార్కులు సాధించిన 26 మంది విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ.6.50 లక్షల నగదు పురస్కారాలు అందజేశారు. ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన 59 మంది విద్యార్థులకు రూ.50 వేల చొప్పున రూ.29.50 లక్షలు అందజేశారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు కూడా అందజేస్తున్నామన్నారు. తన తండ్రికి విద్య అంటే ఎంతో మక్కువని, అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని భావించేవారని, అందుకే ఆయన పేరు మీద చదువులో రాణించే పేద విద్యార్థులకు ప్రోత్సహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
అంతకుముందు తల్లిదండ్రులు దైవ స్వరూపాలని పేర్కొంటూ, విద్యార్థులతో మంత్రోచ్చారణల మధ్య తమను కన్నవారి కాళ్లు కడిగించారు. మంత్రి సవితను కురుబ సామాజిక వర్గీయులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రతిభ పురస్కారాల ప్రదానం అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సవిత భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రాష్ట్ర కురుబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.















